
- ఉపాధిహామీ పథకంలో సోషల్ ఆడిట్‌కు సహకరించని పంచాయతీరాజ్ ఇంజినీర్లు
- రోడ్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణ పనుల రికార్డులు ఇవ్వకుండా సతాయింపు
- కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 103 పనులకు 19 పనులకే రికార్డులు
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క రికార్డూ ఇవ్వలే..
- చాలాచోట్ల నాసిరకంగా నిర్మాణాలు
హైదరాబాద్, వెలుగు : ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 1300 వందల కోట్లతో వివిధ జిల్లాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల వివరాలు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఆఫీసర్లు మొండికేస్తున్నారు. పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా ఆయా వర్క్స్‌కు సంబంధించిన రికార్డులు సోషల్ ఆడిట్ కోసం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలు బయటపడ్తాయనే రికార్డులు ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నిజానికి మెటీరియల్, లేబర్కాంపోనెంట్ కింద ఈజీఎస్ నిధులను 60:40 నిష్పత్తిలో ఖర్చు చేయాలి. ఈ పనులన్నీ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పర్యవేక్షణలో జరుగుతాయి. గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయ్యాక ఎన్ని ఫండ్స్‌తో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్న వివరాలతో పంచాయతీరాజ్ఏఈలు మండలాలవారీగా రికార్డులు తయారుచేసి జిల్లా స్థాయిలో డీఆర్డీవోలకు సమర్పించాలి. అక్కడి నుంచి వచ్చే రికార్డులు హైదరాబాద్ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్, ఈఎన్సీకి, తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్‌కు చేరాలి.
అనంతరం ఆ రికార్డుల ఆధారంగా సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ (ఎస్‌ఎస్‌ఏఏటీ) ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో సోషల్ఆడిట్టీమ్స్లు తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. రికార్డుల్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరిగిందా, లేదా ? జరిగితే క్వాలిటీ ఎలా ఉంది ? ఏమైనా అక్రమాలు జరిగాయా ? ఎక్కడైనా బినామీ మస్టర్లు వేశారా ? వంటి వివరాలతో ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఎక్కడైనా అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీకి ఆదేశించే అవకాశం ఉంది. కానీ మండలాల్లో ఏఈ స్థాయిలోనే రికార్డులను సమర్పించకపోవడంతో సామాజిక తనిఖీల ప్రక్రియంతా పెండింగ్‌లో పడింది.
నాసిరకంగా రోడ్లు.. పైస్థాయిలో ఫిర్యాదులు
‘ఉపాధి పనుల జాతర’లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం దాదాపు 96 నియోజకవర్గాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనుల కోసం రూ.1,300 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది.
గతేడాది డిసెంబర్, ఈ ఏడాది మార్చి మధ్య పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. కాగా, అనేక గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల్లో నాణ్యత కొరవడిందని, ఇంజినీరింగ్ అధికారులు ‘మాములు’గా తీసుకుని బిల్లులు చెల్లించారన్న ఆరోపణలున్నాయి.
ఇటీవల పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లోని ఓదెల మండల ఇన్‌చార్జి పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్.. కాంట్రాక్టర్ నుంచి రూ. 90 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎంబీ రికార్డు చేసేందుకు ఏఈ రూ.లక్ష లంచం డిమాండ్ చేయగా.. ఏసీబీ ఆఫీసర్లు పట్టుకుని జైలుకు పంపించారు.
తనిఖీలకు వెళ్లినా సహాయనిరాకరణే..
క్వాలిటీ లేక చాలా రోడ్లు కంకర తేలడంతో ఫిర్యాదులు సీఎంవో దాకా వెళ్లాయి. గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వర్క్స్కొలతలు, పనుల్లో వ్యత్యాసం ఉందని, రూ. కోట్లు దుర్వినియోగం అవుతున్నాయని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆయా చోట్ల సామాజిక తనిఖీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో సోషల్ ఆడిట్ ఆఫీసర్లకు తనిఖీలకు వెళ్లగా.. పీఆర్ ఇంజినీరింగ్ ఆఫీసర్లు రెస్పాండ్ కాలేదు. ఆ మండలంలో మొత్తం103 పనులు జరిగితే కేవలం 19 పనులకు సంబంధించిన రికార్డులే అందాయి.
ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర పనులకు సంబంధించి ఇంతవరకు ఒక్క రికార్డు కూడా అందలేదు. ఈ రెండు చోట్లే కాదు, ఆడిట్ ఆఫీసర్లు ఎక్కడ పనుల తనిఖీకి వెళ్లినా.. పీఆర్ ఇంజినీరింగ్ ఆఫీసర్ల నుంచి సహాయ నిరాకరణే ఎదురవుతోంది. దీంతో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వానికి లేఖ రాస్తం
పీఆర్ఇంజినీరింగ్ ఆఫీసర్లు గ్రామాల్లోని సీసీ రోడ్లకు సంబంధించిన రికార్డులు ఇవ్వడం లేదు. దీంతో ఆడిట్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం గ్రామాల్లో ఈజీఎస్కింద జరిగిన అభివృద్ధి పనుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాస్తాం. చేసిన పనుల వివరాలను ఇంజినీరింగ్ అధికారులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతాం. పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సామాజిక తనిఖీ తప్పనిసరి. అప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సోషల్ ఆడిట్ డైరెక్టర్- తమ్మినేని నిర్మల తెలిపారు.