హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన నుంచి రూ.13,030 కోట్లతో 7,360 కిలోమీటర్ల పొడవు రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టినట్లు రోడ్లు, భవనాల(ఆర్ అండ్ బీ) శాఖ వెల్లడించింది. నాలుగు లేన్ల రోడ్లు 54 శాతం, రెండు లేన్ల రోడ్లు దాదాపు రెండింతలు పెంచినట్లు పేర్కొంది. 2014 లో 669 కిలోమీటర్లు ఉన్న 4 లేన్ల ఆర్ అండ్ బీ రోడ్లు ప్రస్తుతం 1,029 కిలోమీటర్లకు పెరిగాయని తెలిపింది. 2014లో 6,712 కిలోమీటర్ల పొడవున్న 2 లేన్ల రోడ్లు ప్రస్తుతం 12,921 కిలోమీటర్లకు పెరిగాయని చెప్పింది. ఈ మేరకు ఆదివారం ప్రగతి నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర హైవేల పునరుద్ధరణ కింద రూ.4,118 కోట్లతో 13,740 కిలోమీటర్ల పొడవున పనులు చేపట్టామని, ఇందులో 8,621 కిలోమీటర్ల పనులు పూర్తయినట్లు తెలిపింది. రూ. 2,650 కోట్ల అంచనా వ్యయంతో 519 వంతెనల పునర్నిర్మాణం, వెడల్పు పనులు చేపట్టామని, అందులో 391 వంతెనల పనులు పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్, రామగుండం రోడ్లు ఎన్ హెచ్ 563ను కలుపుతూ కరీంనగర్ వద్ద మానేర్ నది మీదుగా హై లెవల్ కేబుల్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని నివేదికలో వెల్లడించింది.
రూ.4,586 కోట్ల వ్యయంతో..
రూ.4,586 కోట్ల వ్యయంతో 553 కిలోమీటర్ల పొడవున చేపట్టిన 22 నేషనల్ హైవే ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, గోదావరి మీదుగా ఒక ప్రధాన వంతెన, ఒక ఫ్లైఓవర్ (అంబర్ పేట్ వద్ద), ఒక ఎలివేటెడ్ కారిడార్ (ఉప్పల్ వద్ద), ఆరామ్ ఘర్ నుంచి శంషాబాద్‌కు 6 లేన్ల రోడ్డు పనులు కొనసాగుతున్నాయని పేర్కొంది. వీటితో పాటు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, దళిత అధ్యయన కేంద్రం, మీడియా అకాడమీ భవనాల పనులు కొనసాగుతున్నాయని ప్రగతి నివేదికలో వెల్లడించింది.
