భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇసుక లారీలతో పరేషాన్..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇసుక లారీలతో పరేషాన్..
  • టీజీఎండీసీకి భారీగా ఆదాయం 
  • ప్రజల ఇబ్బందులు పట్టించుకోని ఆఫీసర్లు 
  • గుంతలతో అధ్వాన్నంగా మారుతున్న రోడ్లు 

భద్రాచలం,వెలుగు:  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇసుక రవాణా కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇసుక లారీలు తిరగడం వల్ల దుమ్ము ధూళితో వాహనదారులు, గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడాల్సివస్తోంది. రోడ్ల మీద భారీ గుంతలు ఏర్పడడంతోపాటు లారీల ఓవర్​స్పీడ్​ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గోదావరి ఇసుక రీచ్​ల వల్ల ఆదాయం బాగానే వస్తున్నా .. ప్రజల ఇబ్బందుల గురించి అధికారుల్లో పట్టింపు కరువైంది. 

రాత్రీపగలు తేడా లేకుండా ఇసుక లారీలు తిరుగుతుండడం గోదావరి పరివాహక ప్రాంతంలోని భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. రీచ్​ల దగ్గరికి లోడ్​ కోసం వచ్చిన లారీలు గంటల తరబడి నిలిచిపోవడం, రోడ్ల మీద గుంతల్లో లోడ్ లారీలు దిగబడి పోతుండడంతో తరచూ ట్రాఫిక్​ జామ్​అవుతోంది. రాత్రి పూట ఇసుక లారీలు పశువులను ఢీ కొట్టి వెళ్లిపోతున్నాయి. 

పెరిగిన ఆదాయం

గోదావరి ఇసుక రీచ్​ ల నిర్వహణ బాధ్యతలు ట్రైబల్​ సొసైటీలకు అప్పగించారు. ఈ సొసైటీల ద్వారా టీజీఎండీసీ ఇసుక బిజినెస్​ చేస్తోంది. ఈ రీచ్​ ల ద్వారా 2022--– 23లో అత్యధికంగా రూ.136 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఏప్రిల్​నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల్లోనే రూ.123 కోట్ల ఆదాయం సమకూరింది. తర్వాత కూడా ఇదే విధంగా ఇసుక బిజినెస్​ కొనసాగితే 2025–-26లో రికార్డ్​ స్థాయిలో రూ.200కోట్లు రావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021–-22లో రూ.106కోట్లు, 2023-–24లో రూ.121 కోట్లు, 2024-–25లో రూ.133 కోట్ల ఆదాయం వచ్చింది. 

అయితే, ఇసుక లారీల వల్ల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై టీజీఎండీసీ దృష్టి పెట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇసుక లారీలను రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు అనుమతించాలని సూచిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. చర్ల, భద్రాచలం మధ్య అన్ని గ్రామాల్లో ఆర్​అండ్​బీ రోడ్లపై గుంతలు పడ్డాయి. మణుగూరు,-కొత్తగూడెం మధ్య కూడా రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ రోడ్లను వెంటనే రిపేర్​ చేయాలని అంటున్నారు. 

 నిరసనలు.. ఆందోళనలు

ఇసుక లారీల సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో ప్రజలనుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఆదివారం దుమ్ముగూడెం మండలం సీతారాంపురంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో, నర్సాపురంలో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీతారాంపురంలో మాజీ జడ్పీటీసీ అన్నె సత్యనారాయణమూర్తి (సత్యాలు) ఆధ్వరంలో ప్రజలు రోడ్డుపై బైఠాయించారు.

 సత్యాలు అక్కడినుంచే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఫోన్​ చేయగా.. ఎమ్మెల్యే టీజీఎండీసీ అధికారులతో మాట్లాడారు. రాత్రి పూట మాత్రమే లారీలు తిరిగేలా నియంత్రించాలని ఆదేశించారు. దుమ్ముగూడెం, -భద్రాచలం మధ్య విలీన ఎటపాక మండలంలోని గ్రామాల మీదుగా రోడ్డు ఉండడంతో వాటిని రిపేర్​ చేయాలని కూడా ఎమ్మెల్యే ఆంధ్రా అధికారులతో మాట్లాడారు.