ఇసుక రవాణా కోసం మానేరులో రోడ్లు.. టోల్​గేట్లు !

ఇసుక రవాణా కోసం మానేరులో రోడ్లు.. టోల్​గేట్లు !
  • పెద్దపల్లి జిల్లాలో యథేచ్ఛగా మాఫియా దోపిడీ
  • వీడీసీల ఆధ్వర్యంలో పంచాయతీ నిధులతో రోడ్లు 
  • జనం రాకపోకల కోసం వేసినట్లు కలరింగ్ 
  • రాత్రంతా ఇసుక రవాణా.. పగలు పబ్లిక్ నుంచి వసూళ్లు

పెద్దపల్లి, వెలుగు: ఇసుక మాఫియాతో రూలింగ్​పార్టీ లీడర్లు మిలాఖత్ అయి మానేరులో మట్టి రోడ్లు వేస్తున్నారు. పంచాయతీ నిధులతో రోడ్లు వేసి మరీ ఇసుక రవాణాకు శాయశక్తులా సహకరిస్తున్నారు. విషయాన్ని కప్పిపుచ్చేందుకు రోడ్లకు టోల్​గేట్లు పెట్టి సామాన్యుల నుంచి పైసలు సైతం వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మానేరులో రాకపోకల కోసమే రోడ్లు వేశామని, ఇసుక రవాణా కోసం కాదని మభ్యపెడుతున్నారు. రాత్రి 7 దాటిందంటే చాలు తెల్లవారేదాకా ఈ రోడ్ల మీదుగా వందలాది ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకోసం ఇసుక మాఫియా నుంచి లీడర్లకు భారీ మొత్తంలో ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 
 

టోల్ గేట్ కు రూ. 22 లక్షల టెండర్  
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​మండలం కిష్టంపేట, ముత్తారం మండలం ఓడెడు వద్ద మానేరు నదిపై గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో టోల్​గేట్లు పెట్టి సామాన్యుల నుంచి టోల్​ఫీజు వసూలు చేస్తున్నారు. తీసుకున్న పైసలకు వీడీసీ పేరుతో రశీదులు కూడా ఇస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వాగులో రాకపోకల కోసమే మట్టి రోడ్లు వేశామని సర్పంచులు చెప్తున్నారు. నిజానికి కిష్టంపేట నుంచి జమ్మికుంట వైపు, ఓడెడ్ నుంచి భూపాలపల్లి జిల్లా వైపు జనం రాకపోకలు పెద్దగా ఉండవు. ఈ రెండు మార్గాల్లో రోజుకు పదికి మించి బైకులు కూడా పోవు. కానీ కిష్టంపేట రోడ్డుపై పెట్టిన టోల్​గేట్​ను రూ.2.3 లక్షలకు, ఓడెడ్​వద్ద టోల్​గేట్​కు ఏకంగా రూ.22 లక్షలకు టెండర్లు దక్కించుకున్నారు. 
 

రాత్రిళ్లు ట్రాక్టర్ల బారులు 
ఈ రెండు చోట్ల నడుస్తున్న ఇసుక క్వారీల కోసమే రోడ్లు వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తగినట్లే చీకటి పడిందంటే వందలాది ట్రాక్టర్లు రాత్రంతా ఇసుక రవాణా చేస్తుంటాయి. ఇక్కడ ​ఇసుక క్వారీలు అఫీషియల్​గా నడుస్తున్నప్పటికీ వాగులో మట్టి రోడ్లు వేసేందుకు ఆఫీసర్లు పర్మిషన్​ ఇవ్వలేదు. దీంతో ఇసుక వ్యాపారులు చక్రం తిప్పి విలేజ్ డెవలప్​మెంట్ కమిటీల పేరుతో మట్టి రోడ్లు పోయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులొస్తే తొలగించే అవకాశం ఉండటంతో జనం రాకపోకలకు అనే నాటకం ఆడుతున్నారు. ఇందుకు ఏకంగా టోల్​గేట్లు పెట్టారు. కానీ ట్రాక్టర్ల నుంచి ఎలాంటి ట్యాక్స్ వసూలు చేయరు. దీని వెనుక నియోజకవర్గ స్థాయి లీడర్లు ఉన్నారని తెలుస్తోంది. అధికారులకు ముడుపులు అందినట్లు తెలుస్తోంది.
 

కఠిన చర్యలు తీసుకుంటాం
ఓడెడ్, కిష్టంపేట వద్ద మానేరు నదిపై ఏర్పాటుచేసిన మట్టి రోడ్లు, టోల్ గేట్లకు పర్మిషన్​ లేదు. రోడ్లు వేసి టోల్ ఫీజులు వసూలు చేస్తున్నవాళ్లపై చర్యలు తీసుకుంటం. త్వరలోనే స్పాట్లను తనిఖీ చేసి టోల్​గేట్లు ఎత్తేస్తాం.                                                         -  లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్, పెద్దపల్లి జిల్లా