ఢిల్లీలో కుండపోత వర్షం.. రోడ్లు, కాలనీలు జలమయం

ఢిల్లీలో కుండపోత వర్షం.. రోడ్లు, కాలనీలు జలమయం

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి.  రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2024, జూన్ 27వ తేదీ అర్థరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తుంది.  

కుండపోత వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఢిల్లీ నగరంలో జన జీవనం స్తంభించింది. ఇండ్ల ముందు, రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. ముఖ్య కూడళ్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రధాన రహదారులపై వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఢిల్లీతో పాటు  గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. 

ఈదురు గాలులకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో టెర్మినల్ 1 పై కప్పు కూలింది. దీంతో ఒకరు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. పై కప్పు కూలడంతో పార్క్ చేసిన కార్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎయిర్ పోర్టులో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. చెక్ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసివేశారు. టెర్మినల్-1లో విమాన రాకపోకలు బంద్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

పై కప్పు కూలిన ఘటనపై స్పందించారు పౌర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ ఘటనపై తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు  చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. టెర్మినల్ దగ్గర ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించానన్నారు. 

కాగా, ఢిల్లీలో వారం మొత్తం ఉరుములు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత  వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు.