రోడ్లకు వానల దెబ్బ... తెలంగాణలో భారీగా తెగిన రహదారులు

రోడ్లకు వానల దెబ్బ... తెలంగాణలో భారీగా తెగిన రహదారులు
  • ఆర్ అండ్ బీ రోడ్లు 629 కిలోమీటర్లు,
  • పంచాయతీ రాజ్ రోడ్లు 85 కిలోమీటర్లు ధ్వంసం 
  • ప్రభుత్వానికి రెండు శాఖల నివేదిక
  • వచ్చే నెలాఖరుకల్లా నష్టం మరింత పెరుగుతుందని అంచనా 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయి. చాలా చోట్ల వరద నీరు ప్రవహించడం వల్ల రోడ్లతోపాటు కాజ్ వేలు, చిన్న బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. శుక్రవారం వరకు రెండు శాఖల పరిధిలో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, కాజ్ వేల వద్ద తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత రిపేర్లకు అయ్యే వ్యయంతో అంచనాలు తయారు చేసిన రెండు శాఖల ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ప్రస్తుతం టెంపరరీ రిపేర్ల కోసం జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఇచ్చిన నిధులను రెండు శాఖల అధికారులు వినియోగిస్తున్నారు. వచ్చే నెలాఖరు వరకు వర్షాలు పడనుండడంతో అప్పటి వరకు రెండు శాఖల పరిధిలో రోడ్లకు జరిగే నష్టం భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఆర్ అండ్ బీ రోడ్లకు భారీగా నష్టం

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్ అండ్ బీ పరిధిలో 454 చోట్ల సమస్య ఏర్పడిందని,అందులో 629 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు దెబ్బతిన్న రోడ్ల శాశ్వత మరమ్మతులకు రూ.800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 22 చోట్ల రోడ్డు తెగిపోతే వెంటనే 4 చోట్ల తాత్కాలికంగా పునరుద్ధరించి ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. 171 చోట్ల వరద ప్రవాహం ఉందని, రాకపోకలకు ఇబ్బంది ఉన్న 108 ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన 71చోట్ల రిపేర్లు చేశామని, మిగతా చోట్ల వేగంగా చేస్తున్నామని వివరించారు. 

వాగుల వెంట 58 కి.మీ రోడ్డు కోతకు గురైందని, అందులో 378 మీటర్లు మూసివేశామన్నారు. మొత్తంగా 147 చోట్ల లో కాజ్ వే, మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులను తాత్కాలికంగా, శాశ్వతంగా పునరుద్ధరించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ పరిధిలో అత్యధికంగా ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సత్తుపల్లి, సంగారెడ్డి, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు సర్కిళ్లలో ఎక్కువ రోడ్లు డ్యామేజ్ అయ్యాయని వెల్లడించారు. 

పీఆర్ పరిధిలో 85 కిమీ డ్యామేజ్

పంచాయతీ రాజ్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో 124 చోట్ల 84.87 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక పునరుద్ధరణ రూ.6.02 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ పనుల కోసం రూ.141.68 కోట్లు అవుతాయని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. మొత్తం దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు తాత్కాలిక‌‌, శాశ్వత పనుల కోసం రూ.147.70 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 

ప్రత్యేక కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు

వరద నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలకు సహాయం అందించేందుకు హైదరాబాద్​ ఈఎన్సీ కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌‌ను ఏర్పాటు చేసింది. నీటి సరఫరా, రహదారి, ఇతర సమస్యలు తలెత్తితే ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 040 -3517 4352 ను అందుబాటులోకి తీసుకొచ్చింది.