
- రూ.100 కోట్ల పనులు ఏండ్ల తరబడి ఏడియాడనే..
- రాకపోకలకు గోసపడుతున్న జనం
- మూడు రాష్ట్రాలు, జిల్లా వాసుల అవస్థలు
- పట్టించుకొని ఆఫీసర్లు , ప్రజాప్రతినిధులు
రామకృష్ణాపూర్/ జైపూర్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టిన ఆర్వోబీ, బ్రిడ్జిల నిర్మాణ పనులు డెడ్‌స్లోగా సాగుతున్నాయి. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టిన 3 వంతెనల నిర్మాణ పనులు కాంట్రాక్టర్ల అలసత్వం, ఆఫీసర్ల నిర్లక్ష్యంతో ఏండ్ల తరబడి ఏడియాడనే ఉంటున్నాయి. నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్3 రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో3 చోట్ల రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏడేండ్లుగా రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులు
మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్–మంచిర్యాల నేషనల్ హైవేలోని క్యాతన్‌పల్లి రైల్వే గేటు వద్ద చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఏడేండ్లుగా సాగుతున్నా.. ఇప్పటి వరకు పూర్తికాలేదు. దీంతో మందమర్రి, నెన్నెల మండలాల పరిధిలోని మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలతో పాటు 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ క్యాతన్‌పల్లి రైల్వే గేటు వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రజలకు మెరుగైన రవాణా వసతులుకల్పించాలని 2014లో అప్పటి పెద్దపల్లి ఎంపీ డాక్టర్ జి.వివేక్‌వెంకటస్వామి క్యాతన్‌పల్లి రైల్వే గేటు వద్ద ఆర్వోబీ కోసం రూ.32 కోట్లు శాంక్షన్ చేయించారు. ఏడాది కాలంలో రైల్వే ట్రాక్‌పై రైల్వే శాఖ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఆర్వోబీకి ఇరువైపుల 1,200 మీటర్ల అప్రోచ్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2018లో రూ.27.50 కోట్ల ఫండ్స్‌ను కేటాయించగా.. మంచిర్యాలకు చెందిన రవీందర్రావు అనే కాంట్రాక్టర్ నిర్మాణ పనులు షురూ చేశారు. సదరు కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులను స్లోగా చేస్తున్నా.. సంబంధిత ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. దీంతో అప్రోచ్ రోడ్డు పనులు ఎప్పుడు పూర్తయితయో తెలియని పరిస్థితి నెలకొంది.
స్లోగా సింగరేణి ఫ్లై ఓవర్‌బ్రిడ్జి పనులు
జైపూర్ మండలం ఇందారం అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద నిర్మిస్తున్న సింగరేణి ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు స్లోగా సాగుతున్నాయి. రూ.35 కోట్ల అంచనా వ్యయంతో రెండేళ్ల కింద చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. ఇందారం సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్మాణంలో భాగంగా ఓవర్‌బర్డెన్ (మట్టిని)ను రాజీవ్ హైవే దాటి ఎస్సార్పీ ఓసీపీ వైపు ఉన్న యార్డులో డంప్ చేసే వెహికల్స్ రాకపోకల కోసం హైదరాబాద్ మంచిర్యాల రాజీవ్హైవే ఇందారం అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. మంచిర్యాల–పెద్దపల్లి జిల్లాల బార్డర్ ప్రాంతమైనా.. గోదావరి నది బ్రిడ్జి నుంచి ఇందారం క్రాస్ రోడ్డులో గల రాజీవ్ రహదారిపై ఇటీవల తరచూ యాక్సిడెంట్లు అవుతున్నాయి.ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కారణంగా రోడ్డు డైవర్షన్ చేశారు. ఇందుకోసం వేసిన సర్వీసు రోడ్డు నిర్మాణం సరిగ్గా లేకపోవడం, హెచ్చు తగ్గుల వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ కంపెనీ నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు స్లోగా నడుస్తున్నాయి.
రసూల్‌పల్లి వంతెన లేక 3 రాష్ట్రాల ప్రజల ఇక్కట్లు
జైపూర్ మండలం రసూల్‌పల్లి వద్ద 63వ నేషనల్ హైవే (నిజామాబాద్–జగ్ధల్‌పూర్) లోని రసూల్‌పల్లి వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2017లో జైపూర్ రసూల్‌పల్లి నుంచి 42 కి.మీ పొడవునా.. కి.మీ కు రూ.3.48 కోట్ల వ్యయంతో రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా చేపట్టారు. పనులు చేపట్టి మూడేండ్లు దాటుతున్నా.. వంతెన పనులు పూర్తి కాలేదు. ఏటా వర్షకాలం వాగు ఉప్పొంగడంతో వంతెన పక్కన ఉన్న అప్రోచ్ రోడ్డుపై నుంచి వరద ఉధృతి పెరగడం, ఎలాంటి ఆల్టర్నేట్ రోడ్డు లేకపోవడంతో నేషనల్ హైవేపై గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతున్నాయి. అత్యవసర చికిత్స, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడటంతో స్థానిక పోలీసులే వారిని వాగు దాటించిన సందర్భాలున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.