రాకెట్ బౌలర్..బుమ్రా

రాకెట్ బౌలర్..బుమ్రా

జస్​ప్రీత్​ బుమ్రా.. ఇండియా బౌలింగ్​ అమ్ముల పొదిలో ఉన్న ‘నెంబర్​ 1’ అస్త్రం. బ్యాట్స్​మెన్​ను ముప్పుతిప్పులు పెడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. యాక్షన్​, లైనప్​, రన్నప్​ అన్నీ బుమ్రాను మిగతా బౌలర్లకు భిన్నంగా నిలిపాయి. బంతిని ఎంత వేగంగా విసురుతాడో అంతే కచ్చితత్వంతో లైన్​ అండ్​ లెంగ్త్​ పాటిస్తాడు. ఇన్​స్వింగర్లు, యార్కర్లు, రివర్స్​స్వింగ్​లతో బ్యాట్స్​మెన్​కు పిచ్చెక్కిస్తాడు. ఇవన్నీ ఇతర బౌలర్లూ చేస్తున్నా, బుమ్రా బౌలింగ్​లో బ్యాట్స్​మెన్​ అంతలా ఇబ్బంది పడడానికి కారణమేంటి? అంటే అందులో పెద్ద రాకెట్​ సైన్స్​ ఉందంటున్నారు ఐఐటీ కాన్పూర్​కు చెందిన ఏరోస్పేస్​ ఇంజనీరింగ్​ ప్రొఫెసర్​ సంజయ్​ మిట్టల్​. అతడి బౌలింగ్​పై ఆయన పెద్ద పరిశోధనే చేశారు. బుమ్రా ఎందుకు టాప్​ బౌలార్​గా నిలిచాడో పక్కా లెక్కలేసి మరీ వివరించారు. ఆయన పరిశోధనా సారాంశమిదీ…

ఫాస్ట్​ బౌలర్ల ప్రధాన అస్త్రం బంతి వేగం, యాక్షన్, బంతిని రెండు వైపులా స్వింగ్​ చేసే నైపుణ్యమే. బంతి ఎంత వేగంగా పడితే అంత పర్​ఫెక్ట్​గా ఉంటుందట. అంటే వేగంగా పడిన బంతికి బ్యాట్స్​మన్​ స్పందించే టైం చాలా తక్కువ. కాబట్టి బంతిని బాదడంలో బ్యాట్స్​మన్​ ఇబ్బంది పడతాడు. బంతి సీమ్​ పొజిషన్​ను దాచిపెట్టడమన్నది బౌలర్​ యాక్షన్​పై ఆధారపడి ఉంటుంది. బంతి పాయింట్​, ఎత్తు, బంతి వేసే పద్ధతి, బ్యాక్​స్పిన్​ల మీదే బౌలర్​ సక్సెస్​ ఆధారపడి ఉంటుంది. బుమ్రా విషయంలో అవన్నీ పక్కాగా జరుగుతున్నాయి. అతడు గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలడు. అతడి యాక్షన్​ కూడా బ్యాట్స్​మెన్​ బంతిని అర్థం చేసుకోవడంలో గందరగోళానికి గురి చేస్తుంది. కానీ, ఎందుకు? అది తెలుసుకోవాలంటే బంతి ఏరోడైనమిక్స్​ను తెలుసుకోవాలి.

సన్నని గాలి పొర….

బంతిని వదిలినప్పుడు అది కదిలేటప్పుడు దాని చుట్టూ సన్నని గాలి పొర ఏర్పడుతుంది. దాన్నే బౌండరీ లేయర్​ అంటారు. ఒక టైం దగ్గర ఆ బౌండరీ లేయర్​ బంతి ఉపరితలం నుంచి వేరుబడిపోతుంది. అది వేరుపడే టైం, ఆ పాయింటే బంతి ఉపరితలంపై పడే ఒత్తిడిని ప్రభావితం చేస్తుంది. అంటే ఎంత తొందరగా ఆ లేయర్​ విడిపోతే అంత ఒత్తిడి పడుతుంది. లేటుగా వేరుపడితే ఒత్తిడి తక్కువగా ఉన్నట్టు అర్థం. బంతి రెండు వైపులా ఆ రెండూ జరుగుతాయి. దాంతో పాటు ద్రవ్య ప్రవాహం (ఫ్లుయిడ్​ ఫ్లో)లో కీలకమైన టర్బులెన్స్​ (అస్థిరమైన షేకింగ్‌) కూడా ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు ప్రవాహ వేగం నిదానంగా ఉంటే, ఆ ప్రవాహం ఓ పద్ధతి ప్రకారం స్మూత్​గా, స్థిరంగా సాగుతుంది. దాన్నే లామినార్​ (స్థిర) ప్రవాహం అంటారు. ప్రవాహ వేగం పరిమితిని మించితే ఆ ప్రవాహం ఇష్టమొచ్చినట్టు వెళ్లిపోతుంది. దాన్నే టర్బులెన్స్​ (అస్థిర) ప్రవాహం అంటారు. బంతి విషయంలోనూ అదే జరుగుతుంది. శక్తి పెరిగే కొద్దీ లామినార్​ బౌండరీ లేయర్​ కన్నా టర్బులెంట్​ బౌండరీ లేయర్​ ఎక్కువ సేపు బంతిని అంటుకుని ఉంటుంది.

రివర్స్​ మాగ్నస్​ ఎఫెక్ట్​…

అడ్వాన్సింగ్​ సైడ్​లో త్వరగా లేయర్​ వేరుపడడం వల్ల ఆ భాగంలో బంతిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని పై భాగంలో మాత్రం ఒత్తిడి తక్కువుంటుంది. దాని వల్ల బంతిపై అప్​వార్డ్​ ఫోర్స్​ (ఎక్కువ బలం) పడుతుంది. బ్యాక్​స్పిన్​తో కదిలే బంతిపై ఈ మాగ్నస్​ ఫోర్స్​ పడడం వల్ల బంతి ఎక్కువ సేపు గాల్లో ఉంటుంది. దీంతో బ్యాట్స్​మన్​ బంతిని ఈజీగా బాదేస్తాడు. బంతి రొటేట్​ అయ్యే స్పీడ్​ పెరిగిన కొద్దీ ఆ పరిణామాలన్నీ మారుతూ ఉంటాయి. బంతి స్పీడ్​ పెరిగే కొద్దీ అడ్వాన్సింగ్​ సైడ్​లో టర్బులెన్స్​ పెరుగుతుంది. ఈ టర్బులెన్స్​ వల్ల లేయర్​ ఫ్లో వేరుపడే టైం లేట్​ అవుతుంది. లేట్ అయ్యే కొద్దీ ఆ ఫ్లో అడ్వాన్సింగ్​ సైడ్​వైపు వెళ్లిపోతుంది. దాని వల్ల తక్కువ, ఎక్కువ ఒత్తిళ్లు రివర్స్​ అవుతాయి. అంటే, పై భాగంలో ఎక్కువగానూ, కింది భాగంలో తక్కువగానూ ఉంటాయి. దీంతో మాగ్నస్​ ఫోర్స్​ రివర్స్​ అవుతుంది. దాన్నే రివర్స్​ మాగ్నస్​ ఫోర్స్​ అంటారు. ఇదంతా కూడా స్పిన్​ రేషియో మీదే ఆధారపడి ఉంటుంది. అంటే బంతి రొటేషన్​ టైంలో టిప్​ స్పీడ్​, బంతి వేగాల నిష్పత్తినే స్పిన్​ రేషియో అంటారు. బ్యాక్​స్పిన్​తో కదిలే బంతిపై రివర్స్​ మాగ్నస్​ ఎఫెక్ట్​ ఉంటే ఆ బంతి చాలా వేగంగా పడుతుంది. దాని వల్ల బ్యాట్స్​మన్​కు టైమింగ్​ దొరకదు. బంతి గమనాన్నీ అంచనా వేయలేడు. అలాంటి బంతులతోనే వికెట్లు పడతాయి. కాబట్టి బౌలర్లు ఆ స్పిన్​ రేషియోను రివర్స్​ మాగ్నస్​ ఎఫెక్ట్​తో సమానంగా ఉంచుకుంటే వికెట్లు ఈజీగా పడతాయి. బుమ్రా విషయంలో ఇవన్నీ ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. అతడి విషయంలో స్పిన్​ రేషియో దగ్గరదగ్గర 0.1 ఉంటుంది. ఐఐటీ కాన్పూర్​లోని నేషనల్​ విండ్​ టన్నెల్​ ఫెసిలిటీలో ప్రయోగాత్మకంగా సంజయ్​ మిట్టల్​ అతడి బౌలింగ్​ రహస్యాన్ని కనుగొన్నారు.