- డ్రగ్ సప్లయర్లతో డైరెక్ట్ కాంటాక్టులు, డ్రైవర్‌తో ట్రాన్స్‌పోర్ట్
- ఫామ్ హౌస్ చుట్టే సిట్ దర్యాప్తు
- ఐదు రోజులుగా ఆరుగురు నిందితుల విచారణ
- కేసు పురోగతిని సమీక్షించిన ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు
హైదరాబాద్, వెలుగు:
రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్‌కు బానిసైనట్లు.. ఫామ్ హౌస్, పబ్బుల్లో వీకెండ్ లిక్కర్, డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ సప్లయర్లతో రోహిత్ రెడ్డికి డైరెక్ట్ లింకులు ఉన్నట్లు గుర్తించింది. గత రెండు నెలల వ్యవధిలో మూడు వీకెండ్ పార్టీలు జరిగినట్లు.. పొలిటికల్, బిజినెస్ సెటిల్‌మెంట్లు జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించింది.
ఈ మేరకు రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ కుమార్, డ్రైవర్ శరత్ కుమార్ నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి సహా11 మందిని అరెస్ట్ సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్‌బాబు సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శంషాబాద్ రూరల్ పీఎస్‌ను ఆయన సందర్శించారు.
సిట్ చీఫ్ యోగేష్ గౌతమ్‌ను కేసు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ సహా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయన తమ్ముడు రితేశ్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలు రిమాండ్‌లో ఉన్నారు. వీరి కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది.
ఆరుగురు నిందితులకు ఒకే బ్యాంకులో అకౌంట్లు!
ఫామ్ హౌస్ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్.. ప్రధానంగా ఫామ్ హౌస్‌లో వీకెండ్ పార్టీలు, డ్రగ్స్, నిందితుల ఆర్ధిక లావాదేవీలు, వ్యాపారాలకు చెందిన వివరాల ప్రొఫైల్ ను సిద్ధం చేస్తున్నది. రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకోవడానికి ముందే ఫామ్‌హౌస్ పార్టీలు, అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి వివరాలు రాబడుతున్నది. ఇందులో భాగంగా రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్‌కుమార్, డ్రైవర్ శరత్ కుమార్, బాబిలోనా పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డి, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, ప్రియాంక రెడ్డి సహా మరో ఇద్దరు నిందితులను ఐదు రోజులుగా విచారిస్తోంది.
ఒక్కొక్కరిని సుమారు గంటన్నర పాటు విడివిడిగా ప్రశ్నిస్తోంది. పార్టీలో పాల్గొన్న అందరి బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించినట్లు తెలిసింది. కాగా, వీరందరికీ యాక్సిస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆయా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన పెడ్లర్ల బ్యాంక్ అకౌంట్లు, సిట్ విచారణకు హాజరవుతున్న నిందితుల అకౌంట్లలో పలుమార్లు ట్రాన్సాక్షన్లు జరిగినట్లు గుర్తించారు.
న్యాయవాది కౌశిక్ రవి పొంతనలేని సమాధానాలు
ఫామ్ హౌస్ పార్టీకి షిమ్లా నుంచి కొకైన్ కొనుగోలు చేసినట్లు చెప్పిన బెంగళూరు న్యాయవాది కౌశిక్ రవి విచారణకు సహకరించడం లేదని తెలిసింది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు సమాచారం. కాగా, రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ తెలిపిన వివరాల మేరకు స్థానిక డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింఘ్ కోసం నాలుగు బృందాలుగా గాలిస్తున్నారు. అభిషేక్ తల్లిదండ్రులను, స్నేహితులను ఆరా తీసినప్పటికీ జాడ తెలియలేదని సమాచారం.
ఈ క్రమంలోనే రవి ట్రావెల్ హిస్టరీని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. షిమ్లా సహా ఎక్కడెక్కడ అతను ట్రావెల్ చేశాడు, కారణాలేంటీ అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు కౌశిక్ రవితో రోహిత్ రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ బిజినెస్ డీల్స్‌తో పాటు వీరంతా పాల్గొన్న పార్టీలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డితో కలిసి పలు పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు అర్జున్ రెడ్డితో కలిసి వచ్చిన మహిళా ప్రియాంక రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది.
