అసైన్డ్ ల్యాండ్లో రోహిత్రెడ్డి ఫామ్హౌస్.. అనుమతులు లేకుండా నిర్మాణం.. పర్మిషన్లు తీసుకోకుండానే పార్టీలు!

అసైన్డ్ ల్యాండ్లో రోహిత్రెడ్డి ఫామ్హౌస్.. అనుమతులు లేకుండా నిర్మాణం.. పర్మిషన్లు తీసుకోకుండానే పార్టీలు!

చేవెళ్ల, వెలుగు: వివాదాలకు కేంద్రబిందువుగా మారిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఫామ్ హౌస్ నిర్మించిన భూమి అసైన్డ్ పట్టా భూమిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్​లోని సర్వే నంబర్ 117/33లో ఉన్న 3.39 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలో అంతంగారి జంగయ్యకు అసైన్ చేసింది. 

ఇందులోని 2 ఎకరాలను రోహిత్ రెడ్డి తండ్రి పంజుగుల విఠల్ రెడ్డి 2006లో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద కొనుగోలు చేయగా, మిగతా 1.29 ఎకరాల భూమిని గుల్ల రాములు, సంఘం అంజయ్య, కొడెపాక లక్ష్మణ్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధమని తెలిసినా అప్పటి అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 

ప్రస్తుతం భూభారతి పోర్టల్, 22ఏ రిజిస్టర్​లోనూ ఈ భూమి జంగయ్య పేరు మీద అసైన్డ్ ల్యాండ్​గానే నమోదై ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను పైఅధికారులకు నివేదిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. నాలా కన్వర్షన్​చేయకుండానే ఫామ్​హౌస్​ను కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. పార్టీల నిర్వహణకు సైతం పోలీసుల అనుమతి పొందాల్సి ఉండగా, ఇన్నాళ్లు ఎలాంటి పర్మిషన్లు లేకుండా మందు, డ్రగ్స్​ పార్టీలు నిర్వహించినట్లు తెలిసింది.