- శ్రేయస్ అయ్యర్, రాహుల్‌పై దృష్టి
- ఆసియా, వరల్డ్ కప్ టీమ్స్‌పై కొనసాగుతున్న సందిగ్ధత
ముంబై: టీమిండియా లైనప్‌లో అత్యంత కీలకమైన నాలుగో ప్లేస్‌కు సరిపోయే బ్యాటర్ ఇంకా దొరకలేదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత చాలా మందిని ప్రయత్నించినా ఎవరూ సక్సెస్ కాలేదన్నాడు. ఆసియా, వన్డే వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్ది ఈ ప్లేస్‌పై సందిగ్ధత ఉందని స్పష్టం చేశాడు. ‘మాకు నాలుగో నంబర్‌లో సమస్య ఉంది. యువీ తర్వాత ఆ ప్లేస్‌కు సరైనోళ్లు దొరకడంలేదు. కొన్నాళ్లు శ్రేయస్ అయ్యర్ ఆ ప్లేస్‌లో బాగా ఆడాడు. అతని గణాంకాలు కూడా చాలా బాగున్నాయి. కానీ దురదృష్టవశాత్తూ గాయాలు అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. చాలా రోజుల నుంచి అతను టీమ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ 4, 5 ఏళ్లలో చాలా మంది కుర్రాళ్లు గాయపడ్డారు. ఫలితంగా ఎవరో ఒకరు వచ్చి ఆడి వెళ్లిపోతున్నారు. కానీ స్థిరంగా ఆడే బ్యాటరే దొరకడం లేదు. ఇప్పుడు రెండు మెగా ఈవెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్లేస్ భర్తీపై దృష్టి పెట్టాలి’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
శ్రేయస్, రాహుల్ వస్తే..
నాలుగు నెలలుగా ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తే నాలుగో నంబర్ సమస్య కొంత వరకు తగ్గుతుందని రోహిత్ భావిస్తున్నాడు. అయితే వీళ్లిద్దరు గాయాల నుంచి కోలుకుని వస్తున్నారు కాబట్టి ఎలా ఆడతారన్న సందేహాలు కూడా ఉన్నాయి. నాలుగో ప్లేస్‌లో 20 మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ 47.35 యావరేజ్‌తో 805 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐదో ప్లేస్ కోసం కీపర్ కమ్ బ్యాటర్‌గా రాహుల్ పనికొస్తాడని మేనేజ్‌మెంట్ నమ్మకం పెట్టుకుంది. ‘నాతో సహా ఎవరు కూడా టీమ్‌కు అటోమెటిక్‌గా సెలెక్ట్ కారు. అలాగే టీమ్‌లో ఎవరి ప్లేస్‌కు గ్యారెంటీ ఉండదు. కాకపోతే ఫామ్‌ను బట్టి కొంత మంది ప్లేయర్లకు తాము ఆడబోతున్నామని ముందే తెలుస్తుంది. ప్రస్తుతం విండీస్‌లో రాణిస్తున్న ప్లేయర్లపై కూడా ఫోకస్ ఉంది. రాహుల్, శ్రేయస్ పెద్ద సర్జరీల నుంచి కోలుకుని వస్తున్నారు. వాళ్ల శరీరాలు ఎంత వరకు సహకరిస్తాయో చూడాలి. మరికొన్ని రోజుల్లో సెలెక్షన్ మీటింగ్ ఉంది. ఇందులో పెద్ద చర్చే జరగనుంది. రైట్ కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తాం’ అని రోహిత్ వెల్లడించాడు.
వరల్డ్ కప్ గెలవాల్సిందే..
వరల్డ్ కప్‌ను గెలిచి ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చుకోవాలని రోహిత్ అన్నాడు. దీనికి అవసరమైన ఆత్మవిశ్వాసం తమలో ఉందని స్పష్టం చేశాడు. ‘ఇప్పటి వరకు నేను వన్డే వరల్డ్‌కప్ గెలవలేదు. ఈ కప్ గెలవడం నా కల కూడా. దీనికోసం పోరాడటం కంటే నాకు మరోటి లేదు. అయితే మెగా కప్ ఊరికే రాదు. చాలా శ్రమించాలి. ప్రతి ఒక్కరం దాని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. మాకు మంచి టీమ్ ఉంది’ అని రోహిత్ తెలిపాడు.
గాయాలతోనే సమస్య
2019 ఇంగ్లండ్‌లో వరల్డ్ కప్ తర్వాతి నుంచి ఇండియాకు అసలు సమస్య ఎదురైందని హిట్‌మ్యాన్ వెల్లడించాడు. గాయాల కారణంగా కీలక స్థానాల్లో ఆడే ప్లేయర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని గుర్తు చేశాడు. ‘గత 4, 5 ఏళ్లలో గాయపడిన ప్లేయర్ల సంఖ్య బాగా పెరిగింది. ప్లేయర్లకు ఇంజ్యురీ అయినప్పుడో లేదా అందుబాటులో లేనప్పుడో వేరే ఆటగాళ్లను ప్రయత్నిస్తాం. కానీ వాళ్లు ఆయా ప్లేస్‌ల్లో కుదురుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు. కొన్నిసార్లు ఫామ్ కోల్పోవడమో, అందుబాటులో లేకపోవడమో జరిగేది. కానీ ఇప్పుడు ఎక్కువగా గాయాలవుతున్నాయి. ఇదే పెద్ద సమస్యగా మారింది’ అని ఈ ముంబైకర్ పేర్కొన్నాడు.
