రోహిత్ శర్మ కెప్టెన్గా అరుదైన ఘనత

రోహిత్ శర్మ కెప్టెన్గా అరుదైన ఘనత

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాగ్ పూర్ టెస్టులో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ...అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ గా రోహిత్  రికార్డులకెక్కాడు. మాజీ కెప్టెన్ లు  కోహ్లీ, ధోనిలకు సాధ్యం కానీ రికార్డును రోహిత్ శర్మ అందుకున్నాడు. ధోని, కోహ్లీ కెప్టెన్లుగా వన్డేలు, టెస్టుల్లో సెంచరీ చేశారు కానీ..టీ20ల్లో కొట్టలేదు. 

ప్రపంచ వ్యాప్తంగా కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ప్లేయర్ల జాబితాలో రోహత్ శర్మ నాల్గో స్థానంలో ఉన్నాడు. రోహిత్ కంటే ముందు దిల్షాన్ (శ్రీలంక), డు ప్లెసిస్ (సౌతాణాఫ్రికా), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించారు. 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ 171 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఇక టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది తొమ్మిదో సెంచరీ కావడం విశేషం. ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ..తాజాగా తొలి టెస్టులోనూ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ...సహచరులు ఔటవుతున్నా..ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు.  పుజారా(7), కోహ్లి (12), సూర్య (8) విఫలమైనా రోహిత్ శర్మ మాత్రం అద్భుతంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 77/1తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.నిలకడగా బ్యాటింగ్ చేసింది. అయితే 23 పరుగులు చేసిన అశ్విన్..118 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పూజారా, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ త్వరగానే పెవీలియన్ చేరారు.  పూర్తిగా బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ (103), జడేజా (12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులతో కొనసాగుతోంది.