
టీమిండియా కెప్టెన్..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఫస్ట్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఆసీస్ తో జరిగిన రెండో టీ20లో నాలుగు సిక్సర్లు సంధించిన రోహిత్..కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ను అధిగమించాడు. గప్తిల్ 172 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా..రోహిత్ శర్మ 174 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రిస్ గేల్ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి 104 సిక్సర్లతో టీమిండియా తరపున టి20ల్లో వంద సిక్సర్లు కొట్టిన రెండో బ్యాట్స్మన్ నిలిచాడు.
అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్..
టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కెప్టెన్ గా రోహిత్ రికార్డు క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మ టీ20ల్లో ఇప్పటి వరకు కెప్టెన్ గా ఐదు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోవడం విశేషం. గతంలో కోహ్లీ మూడు సార్లు, రైనా ఒక సారి మాత్రమే ఈ అవార్డును అందుకున్నారు. ఇక టీ20ల్లో రోహిత్ శర్మ 12 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ జాబితాలో కోహ్లీ ముందున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 13 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యా్చ్ అవార్డులను అందుకున్నాడు.
ఫస్ట్ బ్యాట్స్ మన్..
రెండో టీ20లో రోహిత్ 4 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 500కు పైగా బౌండరీలు బాదిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకు 504 బౌండరీలు బాదగా.. మార్టిన్ గప్టిల్ 478తో రెండో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ 1351 పరుగులు చేశాడు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 154.93గా ఉంది. దీంతో టీ20ల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన కెప్టెన్లలో రోహిత్ స్ట్రైక్ రేట్ మాత్రమే 150 కంటే ఎక్కువగా ఉండటం విశేషం.
రన్స్లోనే ముందే..
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది. అతను 138 మ్యాచ్‌ల్లో 3677 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ 106 మ్యాచ్‌ల్లో 3597 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ ఓపెనర్ గప్తిల్ 121 మ్యాచ్‌ల్లో 3497 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.