Rohit Sharma: ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన రోహిత్.. ప్రాక్టీస్ షూరు

Rohit Sharma: ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన రోహిత్.. ప్రాక్టీస్ షూరు

Rohit Sharma: ఐపీఎల్ క్యాష్‌రిచ్ లీగ్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, ఐదు సార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్ తో ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఆడనుంది. భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహత్ శర్మ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఈ సీజన్‌కు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత మైదానంలో కనిపించని రోహిత్, ఈసారి ఐపీఎల్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముంబై జట్టుకు ప్రధాన ఓపెనర్‌గా ఉన్న అతని మీద జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. 

ముంబై ఇండియన్స్ నెట్ సెషన్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. సోషల్ మీడియా వేదికగా టీమ్ తన ఎక్స్ లో విడుదల చేసిన వీడియోలో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో రోహిత్  భారీ సిక్స్ కొట్టడం కనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా గత ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 15 మ్యాచ్‌లలో 418 పరుగులు మాత్రమే చేసి, సగటు 29.85తో తీవ్రంగా నిరాశపరిచాడు. అందుకే ఈ సీజన్‌లో తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలని అతడు కృతనిశ్చయంతో ఉన్నాడు.

కాగా ముంబై ఇండియన్స్ జట్టులో హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్, విల్ జాక్స్ లాంటి వారు కీలక పాత్ర పోషించారు. అదనంగా ట్రేడ్స్ ద్వారా క్వింటన్ డి కాక్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, మయాంక్ మార్కండే వంటి వారిని కూడా ఎంఐ జట్టులోకి తీసుకుంది. దీంతో ఈసారి 6వ టైటిల్ వేటలో బరిలోకి దిగబోతున్న రోహిత్ శర్మ ఫామ్ ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ సీజన్‌లో అతను ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్‌లు:
* మార్చి 29: ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – ముంబై – రాత్రి 7:30

* ఏప్రిల్ 4: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ – ఢిల్లీ – మధ్యాహ్నం 3:30

* ఏప్రిల్ 7: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ – గువాహటి – రాత్రి 7:30

* ఏప్రిల్ 12: ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై – రాత్రి 7:30