
పాక్తో ఓటమికి రిషబ్, హార్ధిక్ పాండ్యా త్వరగా ఔటవ్వడమే కారణమని రోహిత్ శర్మ అన్నాడు. వారిద్దరు పెవీలియన్ చేరడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసిందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో తమకంటే పాక్ గొప్పగా ఆడిందని..గెలుపు క్రిడిట్ వారికే దక్కుతుందని చెప్పాడు. ఈ పరాజయం తమకు గుణపాఠమని రోహిత్ తెలిపాడు.
ఇలాంటి మ్యాచ్‌లతోనే అసలు సత్తా తెలుస్తుంది..
పాక్తో మ్యాచ్ అంటేనే ఒత్తిడితో కూడుకున్నదని రోహిత్ శర్మ అన్నాడు. ఆ జట్టుతో ఆడిన ప్రతీసారి ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. అయితే ఇలాంటి మ్యాచుల ద్వారానే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చన్నాడు. పాక్ గెలుపులో రిజ్వాన్, నవాజ్ పాట్నర్ షిప్ కీలక పాత్ర పోషించిందన్నాడు. అయితే అప్పటికీ తమకు గెలుపుపై ఆశలున్నాయని చెప్పాడు. పాకిస్థాన్ను ఓడించే శక్తి తమకు ఉందని తెలుసని..అయితే మ్యాచ్ జరుగుతున్న కొద్దీ..పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారడంతో..పాక్ ఈజీగా ఛేజ్ చేసిందని చెప్పుకొచ్చాడు.
పాక్దే క్రిడిట్..
దుబాయ్ పిచ్ పై 181 రన్స్ స్కోరు కాపాడుకోగలిగిందే అని రోహిత్ శర్మ అన్నాడు. అయితే పాక్ మాత్రం అద్బుతంగా ఆడిందని కితాబిచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో మెరుగైన ప్రదర్శన చేశారని చెప్పాడు. అటు కోహ్లీపై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా..క్రీజులో సెట్ అయి బ్యాటింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. విరాట్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడని చెప్పాడు. అయితే కీలక సమయంలో హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ ఔటవడం భారత్ కొంపముంచిందన్నాడు. ఈ తప్పిదాలన్ని సవరించుకొని తర్వాతి మ్యాచ్ లో బరిలోకి దిగుతాం'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
5 వికెట్ల తేడాతో విజయం..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయగా.... రోహిత్ శర్మ 28 రన్స్, కేఎల్ రాహుల్ 28 రన్స్ సాధించారు పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ హస్నైన్, హరీస్ రౌఫ్, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీశారు. ఆ తర్వాత 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్..19.2 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి గెలిచింది. రిజ్వాన్ హాఫ్ సెంచరీతో చేయగా... మహమ్మద్ నవాజ్42 పరుగులు, అసిఫ్ అలీ 16 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు.