ఆదర్శ ప్రభుత్వ పాఠశాల @ కవార్థా

ఆదర్శ ప్రభుత్వ పాఠశాల @ కవార్థా
  • ది బెస్ట్ స్కూల్ గా రూపుదిద్దుకుంటున్న కవార్థా ప్రభుత్వ పాఠశాల
  • వరుసగా ఐదేళ్ల నుంచీ పదో తరగతిలో 100శాతం ఫలితాలు
  • సెలవు రోజుల్లోనూ తరగతుల నిర్వహణ
  • హోళీ, దీపావళే సెలవు దినాలు
  • ప్రైవేటు దీటుగా ఉపాధ్యాయుల కృషి

మామూలుగా ప్రభుత్వ పాఠశాల అనగానే పాఠశాలకు సమయానికి రాని ఉపాధ్యాయులు, ఒకవేళ వచ్చినా... వచ్చామా అంటే వచ్చి వెళ్లిపోవడం, వీటికి తోడు పెచ్చులూడుతున్న పాఠశాల భవనం, విద్యార్థులకు కనీస వసతులు కూడా లేని దుస్థితి... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇవే అని ప్రత్యేకించి చెప్పకపోయినా వీటిల్లో ఏదో ఒకటి మాత్రం ఉండడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ ప్రభుత్వ పాఠశాల అంటే ఇది కాదు.. అని నాణేనికి మరో వైపు చూపినట్టు ఉపాధ్యాయుల అంకిత భావంతో, పిల్లల కృషితో గత ఐదేళ్లుగా వందశాతం ఫలితాలు సాధిస్తున్న కవార్థా ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక కథనం.

కవార్ధా ప్రభుత్వ పాఠశాల - ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధా జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల  గత ఐదేళ్ల బోర్డు పరీక్షలలో స్థిరంగా వంద శాతం ఫలితాలను సాధిస్తూ రికార్డు సృష్టిస్తోంది. సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహించడం వల్ల పదోతరగతిలో గత ఐదేళ్లుగా, 12వ తరగతిలో మూడేళ్లుగా నిరంతరంగా 100శాతం ఫలితాలు సాధించగలుగుతున్నామని ఆ పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు పేర్కొంటున్నారు. ఇది మాత్రమే కాదు, గత మూడు సంవత్సరాలుగా, ఈ పాఠశాలలో, 12వ తరగతి విద్యార్థులందరూ మొదటి తరగతితో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఈ పాఠశాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన 10,12వ తరగతుల పరీక్షలలో, చత్తీస్‌గఢ్‌లోని కవార్ధా జిల్లా ప్రభుత్వ పాఠశాల పిల్లలు వరుసగా ఐదేళ్లుగా 100% ఫలితాలను సాధిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. నేటి కాలంలో, మంచి ఫలితాల కోసం చాలా మంది తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు. కానీ రాష్ట్రంలోని పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలలు తీసుకురాలేని ఫలితాలను సైతం కవార్ధా జిల్లాలోని కపడ ప్రభుత్వ ఉన్న పాఠశాల సాధిస్తూ ప్రైవేటుకు దీటుగా దూసుకుపోతూ, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీని వెనుక ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషి, నిబద్దత ఎంతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంతకీ ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాలకూ రాని గుర్తింపూ, అద్భుత ఫలితాలు ఈ పాఠశాలకే ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని గమనిస్తే.. మామూలుగా స్కూలు అంటే పని వేళల్లో మాత్రమే టీచర్లు, పిల్లలకు అందుబాటులో ఉంటూ, తమ సందేహాలను తీరుస్తారు. కానీ ఈ పాఠశాలలో అలా కాదు. ప్రభుత్వ సెలవుల్లో కూడా తరగతులు నిర్వహించడం వల్ల, విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేసి, రివిజన్ చేయడం వల్ల అత్యుత్తమ రిజల్ట్ ను అందుకునే అవకాశం ఏర్పడుతుంది. మరో ముఖ్య విశేషమేమిటంటే ఈ పాఠశాలకు హోలీ, దీపావళి మాత్రమే సెలవుదినంగా ప్రకటిస్తారు. మిగతా అన్ని పండగ సమయాల్లోనూ ఉపాధ్యాయులు, పిల్లలు విధిగా పాఠశాలకు వస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. 

అందుకే ఈ ఏడాది పదో తరగతిలో మొత్తం 163 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా 12వ తరగతిలో మొత్తం 87 మంది పిల్లలు పరీక్షకు హాజరుకాగా అందరూ మొదటి డివిజన్‌లో ఉత్తీర్ణులయ్యారు. వీరు స్కూల్లోనే కాదు రాష్ట్రస్థాయిలోనూ ప్రథమ శ్రేణిలో మార్కులు సాధిస్తున్నారు. వర్షారాణి బంజారే అనే విద్యార్థిని పదవ తరగతిలో 91.1 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, అంజులత 12వ తరగతిలో 89.1 శాతం సాధించారు. అదే సమయంలో, ఈ ఫలితం యొక్క పూర్తి క్రెడిట్ శాల వికాస సమితి ద్వారా ఉపాధ్యాయులకే ఇవ్వబడుతుంది.

మా స్కూల్‌లో టీచర్‌, స్టూడెంట్స్‌ స్నేహితులుగానే ఉంటాం. ఉపాధ్యాయులు మమ్మల్ని పాఠాలను చాలాసార్లు రివిజన్ చేయిస్తారు. అంతే కాదు అర్థం కాకపోతే వారు మళ్లీ మళ్లీ వివరిస్తారు. ఒకవేళ ఇంట్లో ఉంటే టీచర్‌కి ఫోన్‌ చేసి సందేహాలు నివృత్తి చేసుకుంటాం. బయట కోచింగ్ కూడా చేయనవసరం లేకుండా మా స్కూల్ టీచర్లు బాగా నేర్పిస్తారు. మేము ఇంత మంచి స్కోర్స్ సాధించడానికి అదే కారణం.

-అంజు లత, విద్యార్థిని 

 

ముందు నుంచే ప్రణాళికను సిద్ధం చేయడం ద్వారా పిల్లల చదువుపై దృష్టి సారిస్తాం. మా స్కూల్లో దీపావళి, దసరా సెలవులుంటాయి. ఆదివారం కూడా పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది. చదువులో వెనుకబడ్డ పిల్లలకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు తీసుకుంటాం. అంతేకాదు వారి తల్లిదండ్రుల మొబైల్ నెంబర్ తీసుకుని రాత్రిపూట ఆ పిల్లలకు ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తాం. మా పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు ఒక జట్టుగా కలిసి ఉంటారు. మా పాఠశాల గత 5 సంవత్సరాల నుండి వంద శాతం ఫలితాలను తీసుకురావడానికి కారణం ఇదే.
-రూప్‌చంద్ జైస్వాల్, స్కూల్ ప్రిన్సిపాల్