రోషిబినా సిల్వర్‌‌ కిక్‌..‌ ఆసియా క్రీడల్లో వరుసగా మూడో పతకం

రోషిబినా సిల్వర్‌‌ కిక్‌..‌ ఆసియా క్రీడల్లో వరుసగా మూడో పతకం

నగోయా: చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన ఇండియా ఉషు ప్లేయర్‌‌ నవోరెమ్‌‌ రోషిబినా దేవి ఆసియా క్రీడల్లో అద్భుతం చేసింది. గురువారం జరిగిన విమెన్స్‌‌ 60 కేజీల ఫైనల్లో రోషిబినా 0–2తో జాంగ్‌‌ జియావోయు (చైనా) చేతిలో ఓడినా సిల్వర్‌‌ మెడల్‌‌ను సొంతం చేసుకుంది. ఏషియాడ్‌‌లో రోషిబినాకు ఇది వరుసగా మూడో పతకం కావడం విశేషం. రెండు నిమిషాల చొప్పున జరిగిన రెండు రౌండ్లలోనూ ఐదుగురు న్యాయనిర్ణేతలు చైనీస్‌‌ ప్లేయర్‌‌కు అనుకూలంగా 5–0తో ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చారు. 

తొలి రౌండ్‌‌లో జియావోయు 6–2, 6–3, 6–2, 6–2, 8–2 స్కోర్లతో ఆధిపత్యం చూపెట్టింది. జియావోయు కొట్టిన సైడ్‌‌ కిక్స్‌‌ను రోషిబినా సమర్థంగా అడ్డుకోలేకపోయింది. ఎక్కువ భాగం రక్షణాత్మక ధోరణికి ప్రాధాన్యత ఇవ్వడంతో స్కోరింగ్‌‌లో వెనకబడింది. ఇక చైనీస్‌‌ ప్లేయర్‌‌ చివరి రౌండ్‌‌లోనూ10–-2, 8–-3, 7–-3, 7–-3, 6–-1 స్కోర్లను సాధించి టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. 2023 ఆసియా క్రీడల్లో రజతం సాధించిన రోషిబినా.. 2018లో కాంస్యం నెగ్గింది. 

జూన్‌‌లో శ్రీనగర్‌‌లో జరిగిన ట్రయల్స్‌‌లో మణిపూర్‌‌కు చెందిన రోషిబినా.. దివ్యాన్షి చేతిలో ఓడింది. అయితే గాయం కారణంగా దివ్యాన్షి తప్పుకోవడంతో  రోషిబినా చివరి నిమిషంలో జట్టులోకి వచ్చింది. దాంతో ఎలాంటి ట్రెయినింగ్‌‌ లేకుండానే డైరెక్ట్‌‌గా ఏషియాడ్‌‌లో బరిలోకి దిగి పతకం సాధించడం విశేషం. మరోవైపు సాండా విభాగంలో బరిలోకి దిగిన అథ్లెట్లందరూ 
నిరాశపర్చారు. 

స్కీట్‌‌లో తొలిసారి..

ఆసియా క్రీడల్లో ఇండియా స్కీట్‌‌ షూటర్లు చరిత్ర సృష్టించారు. అనంత్‌‌జీత్‌‌ సింగ్‌‌ నరుక– పరినాజ్‌‌ ధలివాల్‌‌తో కూడిన స్కీట్‌‌ ద్వయం తొలిసారి కాంస్యం పతకం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అనంత్‌‌జీత్‌‌–పరినాజ్‌‌ 44 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. చైనా (52), కొరియా (51) వరుసగా స్వర్ణం, రజతం గెలిచాయి. 

అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌‌లో 138 స్కోరుతో నాలుగో ప్లేస్‌‌లో నిలిచిన అనంత్‌‌జీత్‌‌, పరినాజ్‌‌ ఫైనల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. విపరీతమైన ఎదురుగాలులు వీచడంతో నాలుగు జట్లు మళ్లీ మొదటి నుంచి పోటీని ప్రారంభించాయి. క్వాలిఫికేషన్‌‌లో టాప్‌‌లో నిలిచిన రషీద్‌‌ సలేహ్‌‌–రీమా ఘనేమ్‌‌ తొలి 12 షాట్లతో తడబడటంతో ఖతార్‌‌ నిష్క్రమించింది. ఇండియా 24 లక్ష్యాలలో 21ని ఛేదించింది. 

చైనా 23, సౌత్‌‌ కొరియా 22 లక్ష్యాలతో టాప్‌‌–2లో నిలిచాయి. తర్వాతి రౌండ్‌‌లో గాలులు ఎక్కువ కావడంతో పోటీ కఠినంగా మారింది. అయినప్పటికీ నరుక 24 లక్ష్యాల్లో 23 ఛేదించాడు. ఫలితంగా స్కోరు 44కు చేరింది. ఓవరాల్‌‌గా స్కీట్‌‌లో ఉన్న మూడు ఈవెంట్లలోనూ ఇండియాకు పతకాలు రావడం విశేషం. మెన్స్‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌ పిస్టల్‌‌ టీమ్‌‌ (కమల్జీత్‌‌–బాలకృష్ణ–ఆకాశ్‌‌ భరద్వాజ్‌‌) తృటిలో కాంస్యం మిస్‌‌ చేసుకుని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 

 సెమీస్‌‌లో కబడ్డీ జట్లు

 ఏషియాడ్‌‌లో ఇండియా కబడ్డీ జట్లు సెమీస్‌‌లోకి దూసుకెళ్లాయి. పూల్‌‌–ఎ చివరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో మెన్స్‌‌ టీమ్‌‌ 37–21తో చైనీస్‌‌ తైపీపై గెలిచింది. దాంతో వరుసగా మూడో విజయంతో సెమీస్‌‌లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మ్యాచ్‌‌ ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ప్లేయర్లు తొలి హాఫ్‌‌లో 23–11 ఆధిక్యంలో నిలిచారు. రైడ్స్‌‌ ద్వారా 28, మూడు బోనస్‌‌, ఆలౌట్‌‌ ద్వారా ఆరు పాయింట్లు సాధించారు. 1990 కబడ్డీ ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టినప్పట్నించి ఇండియా మెన్స్‌‌ జట్టు 8 స్వర్ణాలతో కలిపి 9 పతకాలు నెగ్గింది. మరోవైపు విమెన్స్‌‌ జట్టు 50–25తో జపాన్‌‌ను చిత్తు చేసింది. 
 
రోయింగ్‌‌లోనూ తొలి కాంస్యం

 ఇండియా రోయింగ్‌‌ ప్లేయర్లు కూడా ఏషియాడ్‌‌లో అద్భుతం చేశారు. మెన్స్‌‌ డబుల్‌‌ స్కల్‌‌ విభాగంలో సత్నామ్‌‌ సింగ్‌‌–సల్మాన్‌‌ ఖాన్‌‌ కాంస్య పతకంతో రికార్డులకెక్కారు. ఫైనల్లో ఇండియా ద్వయం 6:13.25 సెకన్ల టైమింగ్‌‌లో మూడో స్థానంలో నిలిచారు. ఆసియా క్రీడల చరిత్రలో ఈ ఈవెంట్‌‌లో ఇండియాకు పతకం లభించడం ఇదే ప్రథమం. అయితే సత్నామ్‌‌కు ఇది రెండో మెడల్‌‌ కాగా, సల్మాన్‌‌కు తొలి ఏషియన్‌‌ గేమ్స్‌‌ పతకం ఇది.

 పోటీల ప్రారంభానికి ముందు జట్టు ఎంపిక విషయంలో చాలా వివాదాలు తలెత్తాయి. చివరి నిమిషంలో క్రీడాకారుల ఈవెంట్లను మార్చడంపై కొందరు రోవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కఠినమైన పరిస్థితులకు ఎదురొడ్డి పతకం సాధించారు. మెన్స్‌‌ సింగిల్స్‌‌ స్కల్స్‌‌లో బాల్‌‌రాజ్‌‌ పన్వర్‌‌ నాలుగో స్థానంతో తృటిలో పతకం కోల్పోయారు. ఇతర ఈవెంట్లలో రోహిత్‌‌–ఉజ్వల్‌‌ కుమార్‌‌ సింగ్‌‌ జోడీ కూడా నాలుగో స్థానానికి పరిమితమైంది. 

ఆరో స్థానంలో ప్రణతి

పతకం ఆశలతో బరిలోకి దిగిన ఇండియా జిమ్నాస్ట్‌‌ ప్రణతి నాయక్‌‌ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. విమెన్స్‌‌ వాల్ట్‌‌ ఫైనల్లో 31 ఏళ్ల ప్రణతి 13.100 స్కోరు సాధించింది. వాల్ట్‌‌ రెండు ప్రయత్నాల్లోనూ ఒకేలా 12.900 పాయింట్లు సాధించగా, మిగతావి బోనస్‌‌ పాయింట్లుగా వచ్చాయి. తొలి, రెండో రౌండ్‌‌లోనూ 4.4 డిఫికల్టీ, 8.500 ఎగ్జిక్యూషన్ స్కోర్లను సాధించింది. ఈ పోటీల్లో సౌత్‌‌ కొరియాకు చెందిన యో సియోజేయాంగ్ (14.100) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా.. ఉత్తర కొరియా జిమ్నాస్ట్ ఆన్ చాంగ్ ఓక్ రజతం, చైనాకు చెందిన డు సియు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. 

స్క్వాష్‌‌లో అదుర్స్‌‌

స్క్వాష్‌‌ విభాగంలో అనహత్‌‌ సింగ్‌‌, తన్వీ కణ్నా, అభయ్‌‌ సింగ్‌‌, వీర్‌‌ చోత్రాని క్వార్టర్‌‌ఫైనల్లోకి అడుగుపెట్టారు. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో జోష్న చినప్ప, సెంథిల్‌‌ కుమార్‌‌ జోడీ కూడా ముందంజ వేసింది. విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో అనహత్ సింగ్ 3-0 (11-4, 11-5, 11-7)తో వై ఇలిన్ ఔ యోంగ్‌‌ (సింగపూర్‌‌)ను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌‌లో తన్వీ 3-1తో సింగపూర్‌‌కే చెందిన వై యన్ ఔ యోం గ్‌‌ను ఓడించింది. ఈ విజయాలతో క్వార్టర్స్‌‌లో అనహత్, తన్వీ తలపడనున్నారు. మెన్స్‌‌ సింగిల్స్‌‌లో అభయ్‌‌ సింగ్‌‌ 3-0తో రవిందు లక్సరి (శ్రీలంక)పై గెలిచాడు. వీర్‌‌ చోత్రాని 3-2తో సంజయ్‌‌ జీవా (మలేసియా)ను ఓడించాడు. మిక్స్​డ్ డబుల్స్‌‌లో జోష్న–సెంథిల్‌‌ జోడీ..  సూరజ్ చంద్–షమీనా రియాజ్‌‌పై గెలిచారు.
 
క్వార్టర్స్‌‌లో పర్వీన్‌‌

బాక్సింగ్‌‌లో ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. విమెన్స్‌‌ 65 కేజీల విభాగంలో పర్వీన్‌‌ హుడా వాకోవర్‌‌ విజయంతో క్వార్టర్స్‌‌లోకి ప్రవేశించింది. తజకిస్తాన్‌‌ బాక్సర్‌‌ మాలిక నోజిమోవా బౌట్‌‌కు దూరంగా ఉండటంతో ఇండియన్‌‌ బాక్సర్‌‌కు వాకోవర్‌‌ లభించింది. విమెన్స్‌‌ 51 కేజీ ప్రిక్వార్టర్స్‌‌లో సాక్షి చౌదరి 2–3 తడాతో అలువా బల్కిబేకోవా (కజకిస్తాన్‌‌) చేతిలో ఓడింది. మెన్స్‌‌ 70 కేజీల్లో సుమిత్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లోనూ వెనుదిరిగాడు. ఇరాన్‌‌ బాక్సర్‌‌ అల్‌‌ సరాయ్‌‌ అలీతో జరిగిన బౌట్‌‌లో తొలి రెండు రౌండ్లలో సుమిత్‌‌ ఆధిక్యంలో నిలిచినా.. మూడో రౌండ్‌‌లో మోకాలి గాయంతో బౌట్‌‌ నుంచి తప్పుకున్నాడు.

అథ్లెటిక్స్‌‌లో రెండు పతకాలు..

అథ్లెటిక్స్‌‌లో ఇండియా అథ్లెట్లు రెండు పతకాలు సాధించారు. మిక్స్‌‌డ్‌‌ 4X400 మీటర్ల రిలేలో సిల్వర్‌‌, విమెన్స్‌‌ 10 వేల మీటర్లలో బ్రాంజ్‌‌ మెడల్‌‌ లభించాయి. మిక్స్‌‌డ్‌‌ రిలే ఫైనల్లో పూవమ్మ రాజు–విశాల్‌‌ తెన్నరసు–విత్య రామరాజ్‌‌–మనుతో కూడిన ఇండియా బృందం 3:14.46 సెకన్ల టైమింగ్‌‌తో రెండో స్థానంలో నిలిచారు. ఫలితంగా 2023 హాంగ్జౌలో గెలిచిన సిల్వర్ మెడల్‌‌ను నిలబెట్టుకున్నారు. విమెన్స్‌‌ 10 వేల మీటర్ల ఫైనల్లో సీమా కుమారి 32:50.05 సెకన్ల టైమింగ్‌‌తో మూడో ప్లేస్‌‌లో నిలిచి బ్రాంజ్‌‌ను సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్‌‌లో 16 ఏళ్ల తర్వాత ఇండియాకు పతకం రావడం గమనార్హం. 
 
దిల్‌‌ప్రీత్‌‌ హ్యాట్రిక్‌‌

ఆసియా క్రీడల్లో ఇండియా హాకీ జట్టు హవా కొనసాగుతోంది. గురువారం జరిగిన పూల్‌‌–ఎ లీగ్‌‌ మ్యాచ్‌‌లో 8–2 గోల్స్‌‌ తేడాతో కొరియాపై గెలిచి వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా సెమీస్‌‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. దిల్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ (10, 26, 32వ నిమిషాలు) హ్యాట్రిక్‌‌తో చెలరేగగా, అభిషేక్ (15, 38 ని) రెండు గోల్స్ చేశాడు. శీలానంద్‌‌ లక్రా (4వ ని), కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ సింగ్ (11వ ని), రాజిందర్ సింగ్ (60వ ని) తలా ఒక గోల్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కొరియా తరఫున కిమ్ జే హో, కిమ్ యోంగ్ బోక్ గోల్స్ కొట్టారు.