
మెహిదీపట్నం, వెలుగు: భార్యతో గొడవ పడి ఓ రౌడీషీటర్ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ భాస్కర్ తెలిపిన ప్రకారం.. జియాగూడ నవోదయ నగర్‌కు చెందిన రౌడీషీటర్ ఉమేశ్(34) పై కుల్సుంపుర పోలీస్ స్టేషన్లో 2011లో 17 కేసులు నమోదయ్యాయి. జైలు కెళ్లి ఇటీవలే వచ్చాడు. భార్య శ్వేతతో నిత్యం గొడవ పడుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
సిటీలో మరో చోట సాఫ్ట్ వేర్ ఇంజినీర్..
భార్యతో గొడవపడి సాఫ్ట్‌వేర్‌ఇంజినీర్ సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ కిశోర్ తెలిపిన ప్రకారం.. నెల్లూరుకు చెందిన కుమారస్వామి రెడ్డి కుటుంబం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భవానీనగర్ కాలనీలో ఉంటోంది. కొన్ని రోజులుగా కుమారస్వామి రెడ్డి దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. శనివారం రాత్రి కూడా గొడవ పడ్డారు.
కోపంతో కుమారస్వామి రెడ్డి ఆమెను కొట్టగా స్పృహ కోల్పోయింది. అయితే భార్య చనిపోయిందనుకున్న అతను తాడుతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కాసేపటికి ఆమె లేచి, విషయాన్ని స్థానికులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.