ఇబ్రహీంపట్నంలో గన్తో బెదిరించి రూ.2 లక్షలు స్వాహా..

ఇబ్రహీంపట్నంలో గన్తో బెదిరించి రూ.2 లక్షలు స్వాహా..
  • డబ్బులు ఇస్తావా? చస్తావా? అంటూ దోపిడీ
  •     ఇబ్రహీంపట్నంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: గన్​ చూపించి డబ్బులు ఇస్తావా?.. చస్తావా? అంటూ బెదిరించి ఓ రౌడీషీటర్​ రూ.2 లక్షలు స్వాహా చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం స్వాముల వారి లింగోట్టం గ్రామానికి చెందిన భూషిపాక నాగరాజుకు చెందిన ప్లాట్ ను ఇటీవలే నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హరిజనపురం గ్రామానికి చెందిన నరేశ్​ కొన్నాడు. 

ఇందుకు గానూ నరేశ్​ రూ.2 లక్షల 50 వేలు నాగరాజుకు ట్రాన్స్​ఫర్​ చేశాడు. నాగరాజు వద్ద డబ్బులు ఉన్నాయన్న విషయం అతని పరిచయస్తుడు, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తిరుమలాయపాలేనికి చెందిన రౌడీషీటర్​ ఎదుళ్ల రాజేశ్​రావు తెలుసుకున్నాడు. ఆ డబ్బులు కాజేయాలని ప్లాన్​ ప్రకారం ఈ నెల 15న నాగరాజును నారపల్లి వద్దకు రావాలని పిలిచాడు.

 రాపిడో బైక్​పై వచ్చిన నాగరాజును అక్కడి నుంచి ఇన్నోవాలో ఎక్కించుకుని చింతపల్లికి తీసుకెళ్లాడు. తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా మార్గమధ్యలో ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి వద్ద రాజేశ్​రావు కారును ఆపాడు. నాగరాజు కడుపులో గుద్ది, గన్ తీసి తనకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని బెదిరించాడు. భయంతో నాగరాజు తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును ఇచ్చి, పిన్​ వివరాలు చెప్పాడు.

 ఈ కార్డు ద్వారా రాజేశ్​రావు రూ.2,18,850 డ్రా చేసుకున్నాడు. కేసు పెడితే చంపుతానని బెదిరించి వెళ్లిపోయాడు. బాధితుడు బంధువుల సాయంతో ఈ నెల 22న ఇబ్రహీంపట్నం పోలీసులకు రాజేశ్​రావుతో పాటు అతడికి సహకరించి మరో ఇద్దరిపై ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం రౌడీషీటర్​ రాజేశ్​రావుతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. రాజేశ్​రావుపై పీడీ యాక్ట్​ ఉంది.