
- ఈసారి 7,85,485 పాస్‌పోర్ట్‌లు జారీ చేసినం
సికింద్రాబాద్, వెలుగు: పాస్‌పోర్ట్ జారీలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసు ఐదో స్థానంలో నిలిచింది. ముంబై మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి ప్లేసుల్లో బెంగళూరు, లక్నో, చంఢీగర్ నిలిచాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసు ఆర్పీవో స్నేహజ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 37 రీజినల్ పాస్ పోర్ట్ కేంద్రాల్లో ఈ ఏడాది 1.5 కోట్లకు పైగా పాస్ పోర్టులు జారీ చేయగా, హైదరాబాద్ కేంద్రం 7,85,485 పాస్‌పోర్ట్‌లు జారీ చేసి ఐదో స్థానంలో నిలిచిందని తెలిపారు.
కరోనాకు ముందు 2019లో 5,32,785 పాస్‌పోర్ట్‌లు జారీ చేయగా, 2021లో 4,28,246, 2022లో 6,43,157 పాస్‌పోర్టులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. గతేడాది 2022తో పోలిస్తే లక్షన్నర పాస్‌పోర్టులు ఎక్కువగా జారీ చేశామన్నారు. రీజినల్ పాస్ పోర్టు ఆఫీసులతో పాటు దీని పరిధిలోని ఐదు పాస్ పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీసుల ద్వారా సేవలు అందిస్తూ రోజు 4 వేల దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నట్లు చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్లను ప్రారంభించినట్లు తెలిపారు.