RR vs SRH : నరాలు తెగే ఉత్కంఠ...రాయల్స్పై రైజర్స్ సూపర్ విక్టరీ

RR vs SRH : నరాలు తెగే ఉత్కంఠ...రాయల్స్పై   రైజర్స్ సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్  ఎట్టకేలకు గెలిచింది. ఉత్కంఠపోరులో రాజస్తాన్ రాయల్స్  పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్.. సరిగ్గా 20 ఓవర్లలో 6  వికెట్లకు 217  పరుగులే చేసి విజయం సాధించింది. 

215 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓపెనర్లు అన్ మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ మంచి పాట్నర్ షిప్ ను అందించారు. తొలి వికెట్ కు 51 పరుగులు జోడించారు. అయితే 33 పరుగులు చేసిన అన్ మోల్ ప్రీత్ సింగ్ ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి రెచ్చిపోయి ఆడాడు. అభిషేక్ వర్మతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్ కు 65 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో అభిషేక్ శర్మ 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ శర్మ పెవీలియన్ చేరాడు. ఈ స్థితిలో త్రిపాఠికి హెన్రిచ్ క్లాసెన్ జతకలిశాడు. వీరిద్దరు మూడో వికెట్ కు 41 పరుగులు జత చేశాడు. అయితే 12 బంతుల్లో 26 పరుగులు చేసిన క్లాసెన్ చాహల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 47 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి కూడా ఔటయ్యాడు. స్వల్ప వ్యవధిలో కెప్టెన్ మార్కరమ్ కూడా పెవీలియన్ చేరడంతో సన్ రైజర్స్ 174 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 

రెచ్చిపోయిన ఫిలిప్స్

 ఈ సమయంలో గ్లెన్ ఫిలిప్స్ హ్యాట్రిక్ సిక్సులతో రెచ్చిపోయాడు. 7 బంతుల్లో 3 సిక్సులు, ఒక్క ఫోర్ తో 25 పరుగులు సాధించిన ఫిలిప్స్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఫిలిప్స్ ఔటైనా...చివర్లో అబ్దుల్ సమద్ జట్టును గెలిపించాడు. 7 బంతుల్లో 2 సిక్సులతో 17 పరుగులు చేసి విజయతీరాలకు చేర్చాడు. రాజస్తాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు పడగొట్టగా...అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్ సేన...20 ఓవర్లలో 3 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది.  ఓపెనర్లుగా దిగిన జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్ రాజస్థాన్ కు మంచి ఆరంభాన్ని్చ్చారు. తొలి వికెట్ కు 4.6 ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. అయితే 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసిన యశస్వీజైస్వాల్ మార్కో జాన్సెన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

బట్లర్ సెంచరీ మిస్

యశస్వీ జైస్వాల్ ఔటయ్యాక బట్లర్ విశ్వరూపం చూపించాడు. హైదరాబాద్ బౌలర్లను హడలెత్తిస్తూ వీర బాదుడు బాదాడు. సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించాడు. 33 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన బట్లర్..ఆ తర్వాత సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. అటు సంజూ శాంసన్ కూడా అర్థ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేశాడు. వీరిద్దరు రెండో వికెట్ కు 138 పరుగులు జోడించారు. అయితే సెంచరీకి చేరువలోకి వచ్చిన బట్లర్..95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 

బట్లర్ ఔటైనా..సంజూ శాంసన్ బ్యాట్ ఝూళింపించడంతో రాజస్థాన్ రాయల్స్ చివరకు  20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ , మార్కో జాన్సెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.