సెర్ప్ లో రూ.10 కోట్ల అవినీతీ

సెర్ప్ లో రూ.10 కోట్ల అవినీతీ

పంచాయతీరాజ్​ ముఖ్య కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా సూత్రధారి

సెర్ప్​ డైరెక్టర్​తో కలిసి అక్రమాలు.. సీఎంకు తెలిసే జరిగింది

బీజేపీ సీనియర్​ నేత పేరాల శేఖర్​రావు ఆరోపణ

హైదరాబాద్​, వెలుగు: కొండ పోచమ్మ సాగర్​కు గండ్లు పడ్డట్టే రాష్ట్రంలోని పలు శాఖలకు అవినీతి గండ్లుపడ్డాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్​ రావు ఆరోపించారు. ఇందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్​) లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. పంచాయతీ రాజ్​ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా ఈ అవినీతికి సూత్రధారి అన్నారు. సెర్ప్​ డైరెక్టర్​ అనంతంతో కలిసి 10 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి జూమ్​ యాప్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘గొర్రెల, మేకల పశు ఉత్పత్తి కోసం 2,875 మహిళా స్వయం సహాయక సంఘాలతో లైవ్​స్టాక్​ ఫార్మర్స్​ ప్రొడ్యూసింగ్​ గ్రూప్​లను సెర్ప్​ ఏర్పాటు చేసింది. ఆ సంఘాల్లో 75 శాతం గ్రూపులకు పశు పోషణతో సంబంధమే లేదు. పశు సంవర్థక శాఖ కింద గోపాల మిత్రలు పనిచేస్తున్నప్పటికీ, సెర్ప్​లో పశు మిత్రలను నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్లకు శిక్షణ పేరుతో 6 కోట్ల 50 లక్షల రూపాయలను, పరికరాల కొనుగోలు కోసం మరో 4 కోట్ల 7 లక్షల రూపాయలను కేటాయించారు’’ అని ఆయన ఆరోపించారు. టెండర్లు పిలవకుండానే పరికరాలు కొనాలని నిర్ణయించడం నిబంధనలకు విరుద్ధమని, ఈ పద్ధతిలోనే వారు అవినీతికి తెరలేపారని అన్నారు.

సీఎంకు తెలిసే జరిగి ఉంటుంది

సీఎం కేసీఆర్ కు తెలిసే ఈ అవినీతి జరిగి ఉంటుందని తాను భావిస్తున్నట్టు పేరాల శేఖర్​ రావు అన్నారు. ఈ స్కీం కోసం కేంద్రం 24 కోట్ల రూపాయల నిధులిచ్చిందన్నారు. పశు మిత్రలకు ప్రాక్టికల్​ శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, ఆన్​లైన్​ శిక్షణ ఇచ్చారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి కొత్త పథకాలు, కార్యక్రమాలను చేపట్టరాదని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ ఈ ఇద్దరు అధికారులు కేవలం కమీషన్ల కోసమే దీనిని ప్రారంభించారన్నారు. సెర్ప్ లో జరిగిన అవినీతిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి, ఆ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. అసలు ఎంత మంది పశు మిత్రలు ఉన్నారో, వాళ్ల అడ్రస్​ లతో సహా వెబ్​సైట్​లో పెట్టాలని, వారు ఏర్పాటు చేసిన గ్రూప్​ల వివరాలను సైతం బయట పెట్టాలని శేఖర్​ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

For More News..

మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుచేయలేం

కరోనా ఎంటరై 4 నెలలు.. నో కంట్రోల్

రాగికి పూత పూసి రూ. 20 వేల కోట్ల టోపీ