8వేలకు కక్కుర్తిపడి 1.12 కోట్లతో పట్టుబడ్డ డాక్టర్

8వేలకు కక్కుర్తిపడి 1.12 కోట్లతో పట్టుబడ్డ డాక్టర్

భువనేశ్వర్‌: ఆయన ఓ డాక్టర్. ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రజలకు ఉచితంగా సేవలందించాల్సిన సదరు వైద్యుడు కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు సిజేరియన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు. ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి కోటి రూపాయలకు పైగా స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా పూరీ జిల్లాలోని చెరిచక్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ ఎస్ కే జెనా గైనకాలజిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం నెలలు నిండిన ఓ గర్భిణి హాస్పిటల్కు రాగా ఆమెకు సిజేరియన్ చేసేందుకు రూ. 8వేలు డిమాండ్ చేశాడు. ఉచితంగా వైద్యం అందించాల్సిన డాక్టర్ డబ్బులు డిమాండ్ చేయడంతో పేషెంట్ కుటుంబసభ్యులు విషయాన్ని విజిలెన్స్ అధికారులకు తెలిపారు. గురువారం డాక్టర్ లంచంగా అడిగిన రూ.8వేల నగదు తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే కథ ఇంతటితో అయిపోలేదు. సదరు డాక్టర్పై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉండటంతో ఒడిశా విజిలెన్స్ అధికారులు భువనేశ్వర్ లోని జెనా నివాసంలో సోదాలు నిర్వహించారు. అక్కడ పాలిథిన్ కవర్లలో దాచిన రూ. 1.12కోట్ల నగదు బయటపడింది. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.