
నేషనల్ హైవే గుంతలమయం
పెండింగ్‌లోనే టోల్‌గేట్ నిర్మాణం
బస్ షెల్టర్ల నిర్మాణాలూ ఇన్ కంప్లీట్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కొత్తగా వేసిన నేషనల్ హైవే రోడ్లు కనీసం దశాబ్ద కాలంపాటు చెక్కుచెదరకుండా ఉండాలి. కానీ రూ.120 కోట్లతో వేసిన రోడ్డు రెండేళ్లకే కరాబ్ అయింది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధికి చెందిన కన్‌స్ర్టక్షన్ కంపెనీ కావడంతో చర్యలు తీసుకోవడానికి ఆఫీసర్లు జంకుతున్నారు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా గుడెప్పాడ్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ వరకు 44 కిలోమీటర్ల దూరం రూ.120 కోట్ల నిధులతో ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. 353 సీ పేరిట నేషనల్ హైవే ఆఫీసర్ల ఆధ్వర్యంలో టెండర్లు జరగగా పాటిల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి పనులు దక్కాయి. 2016లో వర్క్ స్టార్ట్ చేశారు. నాలుగేళ్లు దాటినా పనులు ఇంకా పూర్తికాలేదు. కేవలం మెయిన్ రోడ్డు నిర్మాణం మాత్రమే కంప్లీట్ అయింది.
పెండింగ్ పనులే ఎక్కువ..
టెండర్ ప్రకారం ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణంతో పాటు చాలా పనులు చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్ట్ సంస్థ ఈ నాలుగేళ్లలో కేవలం ప్రధాన రోడ్డు పనులు మాత్రమే చేసింది. అవి కూడా నాసిరకంగా జరిగాయి. శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం దగ్గర టోల్‌గేట్ నిర్మాణం, రోడ్డు పక్కన గల గ్రామాల్లో కొత్తగా బస్ షెల్టర్లు, ప్రతీ ఊరిలో నీళ్లు నిల్వ ఉండకుండా సీసీతో కల్వర్టులు కట్టడం వంటి పనులను కాంట్రాక్ట్ కంపెనీ చేపట్టలేదు. ఈ పనులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
కరాబైన రోడ్డు
గుడెప్పాడ్ నుంచి చెల్పూర్ వరకు వేసిన నాలుగు లైన్ల రోడ్డు రెండేళ్లకే పూర్తిగా కరాబైంది. చాలా చోట్ల గుంతలమయంగా మారింది. వాహనాల టైర్ల గుర్తులు పడి డాంబర్ మొత్తం లోతుగా కావడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పరకాల పట్టణంలో పెద్ద గుంతలు పడి వాహనాలు
వెళ్లలేకుండా తయారైంది. మున్సిపాలిటీ ఆఫీసర్లు తాత్కాలిక రిపేర్లు చేశారు. రేగొండ, శాయంపేట మండలాల్లోని అనేక చోట్ల వందలాది గుంతలు పడి వాహనాల రాకపోకలకు డిస్టబ్ అవుతోంది.
నోటీసులకే పరిమితం..
కాంట్రాక్ట్ సంస్థ యజమాని టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ కావడంతో నేషనల్ హైవే ఆఫీసర్లు చర్యలు తీసుకోలేకపోతున్నారు. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టిన సంస్థపై భారీ జరిమానా వేయాలి. ఆ కంపెనీతోనే పూర్తి రిపేర్లు, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ చేయించాలి. నాసి రకం పనులు చేసినందుకు ఆ కంపెనీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. కానీ ఆఫీసర్లు కేవలం నోటీసులు ఇచ్చి
తప్పించుకున్నారు.