దోచుకుతిన్నారా : కాళేశ్వరం మోటార్ల కొనుగోలులో రూ.14 వేల కోట్ల అక్రమాలు

 దోచుకుతిన్నారా : కాళేశ్వరం మోటార్ల కొనుగోలులో రూ.14 వేల కోట్ల అక్రమాలు

కాళేశ్వరం పంపులు, మోటార్ల కొనుగోళ్లలో కాంట్రాక్టర్లకు 327 శాతం అదనపు చెల్లింపులు చేశారని కాగ్ గుర్తించింది. ఈ ప్రాజెక్టులు లిఫ్టులకు సంబంధించి 21 ప్యాకేజీలు ఉండగా అందులో నాలుగు ప్యాకేజీల్లో పంపులు, మోటార్లు సహా ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ ఎక్విప్ మెంట్ కొనుగోళ్లకు రూ.7,212 కోట్లుగా నాడు ప్రభుత్వం అంచనా వేసిందని, కానీ కాంట్రాక్టర్లు రూ.1,686 కోట్లు మాత్రమే బీహెచ్ఈఎల్​కు చెల్లించి కొనుగోలు చేశారు. తద్వారా ఆ నాలుగు ప్యాకేజీల్లో కాంట్రాక్టర్లకు అదనంగా రూ.5,526 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని కాగ్​ పేర్కొంది.

 ఈ నాలుగు పంపుహౌస్​ల రికార్డులతోపాటు మిగిలిన 17 ప్యాకేజీల్లోని పంపుహౌస్ ల రికార్డులను ప్రాజెక్టు అధికారులు తమకు ఇవ్వలేదని కాగ్​ తీవ్రంగా తప్పుబట్టింది. మొత్తం 21 ప్యాకేజీల్లో 8,338 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు, మోటార్లను రూ. 18,936 కోట్లతో కొనుగోలు చేశారని తెలిపింది. ఇంజనీర్లు పనులకు టెండర్లు పిలిచే ముందు మొదట ఎస్టిమేట్లు తయారు చేస్తారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్ఎస్ఆర్) ప్రకారం ఏవైనా వస్తువులు నిర్దేశిత ధరకు లభ్యం కాకపోతే మార్కెట్ నుంచి సేకరిస్తారు. మోటార్లు, పంపుల ధరలు ఎస్ఎస్ఆర్​లో ఉండవు.. కాబట్టి మార్కెట్ నుంచి సేకరించాలనే వెసులుబాటును ఆసరాగా తీసుకొని కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించే ప్రయత్నం జరిగిందని కాగ్​ ఆక్షేపించింది. 

ప్రాణహిత – చేవెళ్ల లిఫ్ట్ స్కీం కోసం బీహెచ్ఈఎల్ నుంచి పంపులు, మోటార్ల కొటేషన్లు తీసుకునే వారు. కానీ.. కాళేశ్వరం మోటార్లు, పంపులు ఎక్కడి నుంచి సేకరించారనే వివరాలను తమకు సమర్పించలేదని, వీటి కొనుగోళ్లలో పారదర్శకత లేదని కాగ్ పేర్కొంది. కేవలం 6, 8, 10, 11 ప్యాకేజీల్లోని 2,805.76 మెగావాట్ల పంపులు, మోటార్లను బీహెచ్ఈఎల్ నుంచి సేకరించారని.. ప్రభుత్వం పంపులు, మోటార్ల సేకరణ వివరాలు ఇవ్వకపోవడంతో బీహెచ్ఈఎల్ ను  సంప్రదించి సప్లయ్ చేసిన మోటార్ల వివరాలు సేకరించినట్లు కాగ్​ తెలిపింది. 

కాళేశ్వర్యం మోటార్ల కొనుగోలుపై కాగ్ ఏం చెప్పిందంటే..!

  • కాళేశ్వరం పంపులు, మోటార్ల కొనుగోళ్లలో 
  •  కాంట్రాక్టర్లకు 327శాతం అదనపు చెల్లింపులు జరిపారు.
  •  కొనుగోళ్లలో రూ.14,501 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు అనుమానం.
  •   జెన్​కోలో రిటైర్​ అయిన ఇంజనీర్​ వేసిన అంచనాలతోనే ఎస్టిమేట్లు రూపొందించి టెండర్లు పిలిచారు. ఆ ఎస్టిమేట్లకు ఆధారాలేమిటో అప్పటి ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వలేదు. ఒక్కో మోటారు కోసం కాంట్రాక్టర్​కు ప్రభుత్వం రూ.2.57 కోట్లు చెల్లించగా.. సదరు కాంట్రాక్టర్ బీహెచ్ఈఎల్ కు రూ.60 లక్షలు మాత్రమే చెల్లించారు. 
  •   ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ ఇంజనీరింగ్ చేయడం ద్వారా రూ.767.67 కోట్లు వేస్ట్​ చేశారు.
  •   కొండపోచమ్మసాగర్  కోసం రూ.74.07 కోట్లతో గ్రావిటీ కెనాల్ తవ్వగా.. ఆ కెనాల్​ మల్లన్నసాగర్​లో మునిగిపోయింది. ఫలితంగా ఆ 74.07 కోట్లు కూడా వృథా అయ్యాయి.
  •  సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో వరదకు  సీసీ బ్లాకులు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి రూ.189.93 కోట్ల నష్టం వాటిల్లింది. వాటి రిపేర్లకు మళ్లీ రూ.476 కోట్లు ఖర్చు చేశారు.
  •  పవర్ హౌసుల్లో వాడే ఈవోటీ క్రేన్లు, మొబైల్ క్రేన్లు, జనరేటర్లు, బ్యాటరీలు, ట్రాన్స్ ఫార్మర్లు, ఎర్తింగ్ మెటీరియల్ కొనుగోళ్లలోనూ భారీగా అక్రమాలు జరిగాయి. వీటి కోసం రూ.1,282 కోట్లు గంపగుత్తగా చెల్లించారని, ఇందులో ఏ పనికి ఏ ప్రాతిపదికన చెల్లించారు.. అనే వివరాలేవీ లేవు. 
  •   ప్రైస్ అడ్జస్ట్​మెంట్ కింద స్టీల్, సిమెంట్ ధరలలో మార్పుల పేరుతో చేసిన చెల్లింపుల్లోనూ రూ.1,342 కోట్ల అక్రమాలు జరిగాయి.