ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.1500 సాయం అందట్లే

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.1500 సాయం అందట్లే
  • లాక్‌‌డౌన్‌‌తో ఇంటికే పరిమితమైన బండ్లు
  • ఎన్నో కుటుంబాల్లో పూట గడవని పరిస్థితి
  • ఈఎంఐలు కట్టాలంటూ ఫైనాన్షియర్ల ఒత్తిడి
  • ఇతర రాష్ట్రాల్లో మాదిరి సర్కార్ ఆదుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌‌, వెలుగులాక్‌‌డౌన్‌‌తో రాష్ర్టంలో ఆటో, క్యాబ్‌‌ డ్రైవర్ల పరిస్థితి ఆగమైంది. సర్కార్‌‌ ఆంక్షలతో ఆటోలు, క్యాబ్‌‌లన్నీ ఇండ్ల దగ్గరే ఉండిపోయాయి. పైసా ఆదాయం లేక ఎన్నో కుటుంబాల్లో పూట గడవని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500, రేషన్‌‌ బియ్యం సాయం కూడా వీరికి అందలేదు. రేషన్ కార్డు లేకపోవడమే ఇందుకు కారణం. ఇలా రేషన్ కార్డు లేక రాష్ర్ట ప్రభుత్వ సాయం అందని డ్రైవర్లు 2 లక్షల మంది వరకు ఉన్నారు.

రేషన్‌‌ కార్డు లేక..

రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల వరకు ట్రాన్స్‌‌పోర్ట్‌‌ కార్లు ఉన్నాయి. ఇందులో కొందరు ఓనర్‌‌ కం డ్రైవర్‌‌ ఉండగా, మరికొందరు ఓలా, ఉబర్‌‌లలో డ్రైవర్‌‌గా పనిచేస్తున్నారు. వీరిలో లక్ష నుంచి 1.5 లక్షల మంది దాకా రేషన్‌‌ కార్డులు లేవని యూనియన్లు చెబుతున్నాయి. ఇందులో 2014లోనే సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా కారు ఉందనే కారణంతో 50 వేల మంది రేషన్‌‌ కార్డులు అధికారులు తొలగించారు.

వాస్తవానికి నాన్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్ కారు ఉంటే రేషన్‌‌ కార్డు ఉండదు. కానీ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ కారు ఉన్న వారిని కూడా అప్పట్లో తొలగించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చామని, అవి ఇప్పటికీ పెండింగ్‌‌లోనే ఉండిపోయాయని యూనియన్‌‌ లీడర్లు చెబుతున్నారు. మరోవైపు ఐదేండ్ల నుంచి రాష్ట్రంలో రేషన్‌‌ కార్డులే ఇవ్వలేదు. ఇక రాష్ట్రంలో 2 లక్షల వరకు ఆటోలు ఉన్నాయి. వీరిది కూడా ఇదే పరిస్థితి. ఆటో ట్రైవర్లలో సుమారు 70 వేల మందికిపైగా రేషన్ కార్డులు లేవు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందడంలేదు. ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించిన రేషన్‌‌ బియ్యం, రూ.1,500 వీరికి అందలేదు.

పూట గడవడమే కష్టమైతాంది..

కొందరు ఆటో డ్రైవర్లు స్టూడెంట్స్‌‌ను తరలించి నెలవారీ డబ్బులు తీసుకునేవారు. అలా ఒక్కో డ్రైవర్‌‌కు నెలకు రూ.15 వేల ఉంచి రూ.20 వేల దాకా ఆదాయం వచ్చేది. కరోనా దెబ్బతో కాలేజీలు, స్కూళ్లు ముందే మూసేశారు. మార్చి నెల డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగితే ‘15 రోజులే కదా ఆటోలో తీసుకెళ్లింది’ అని సగమే చేతిలో పెట్టారు. ప్యాసింజర్‌‌ ఆటోలదీ ఇలాంటి పరిస్థితే. ఓలా, ఉబర్‌‌లలో కొందరు క్యాబ్ డ్రైవర్లు నెలకు 20 వేల దాకా సంపాదించేవారు. నెలా రోజులుగా బండ్లు రోడెక్కక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. పూట గడవడమే కష్టమై అవస్థలు పడుతున్నారు.

ఫైనాన్స్‌‌ కంపెనీల ఒత్తిళ్లు

రాష్ట్రంలోని అనేక మంది క్యాబ్‌‌, ఆటో డ్రైవర్లు ఫైనాన్స్‌‌ కంపెనీల ద్వారా బండ్లు తీసుకున్నారు. ఆ బండ్లను నడుపుకొనే నెల కిస్తీలు చెల్లించేవారు. నెలకు రూ.6 వేల నుంచి రూ.9 వేల వరకు వాయిదాలు చెల్లిస్తున్నారు. వీరంతా మార్చి నెల వాయిదా కట్టలేదు. ఈఎంఐలు చెల్లించాలని కొందరు ఫైనాన్స్‌‌ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయని డ్రైవర్లు పేర్కొంటున్నారు. కుటుంబం గడవడమే కష్టంగా ఉంటే కిస్తీలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని వాపోతున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు డ్రైవర్లను ఆదుకుంటున్నాయి. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం రూ.5 వేలు చొప్పున ప్రకటించింది. ఆటోవాలాలకు ఏపీ ప్రభుత్వం ఏటా రూ.10 వేల సాయంచేస్తోంది. రాష్ర్ట సర్కార్‌‌ కూడా తమను ఆదుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు.

కనీసం సరుకులైనా ఇవ్వాలె

నెల రోజులుగా ఇంట్లనే ఉంటున్నం. చేతిలో డబ్బులు ఎప్పుడో అయిపోయాయి. రేషన్‌‌ కార్డు లేక ప్రభుత్వ పథకాలు అందడంలేదు. అప్లికేషన్‌‌ పెట్టినా కార్డు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, రూ.1,500 అందలేదు. పూట గడవడం ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం స్పందించి కనీసం నిత్యావసర సరుకులైనా ఇవ్వాలి.

-సయ్యద్‌‌ షోయబ్‌‌ హష్మి, ఆటో డ్రైవర్

2014లోనే కార్డు తీసేసిన్రు

2014లో సమగ్ర కుటుంబ సర్వే సమయంలో నా రేషన్‌‌ కార్డు తీసేశారు. దీంతో అన్ని రకాల ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నం. ఇప్పుడు కూడా 1,500, బియ్యం అందలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం డ్రైవర్లకు 5 వేలు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడా ఆదుకోవాలి.

– రఘుపాల్‌‌, క్యాబ్‌‌ డ్రైవర్‌‌