గానంతో 3,800 మంది చిన్నారులకు పునర్జన్మ.. దాతృత్వంతో పాలక్ ముచ్చల్ రికార్డు!

గానంతో 3,800 మంది చిన్నారులకు పునర్జన్మ.. దాతృత్వంతో పాలక్ ముచ్చల్ రికార్డు!

తన మధురమైన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తుంది గాయని పాలక్ ముచ్చల్.  మైమరిపించే పాటలతోనే కాదు అసాధారణమైన మానవ సేవతోనూ మెప్పిస్తోంది .  చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలను అలవర్చుకుంది. వేల సంఖ్యలో చిన్నారులకు ప్రాణదానం చేసింది. ఇప్పుడు తన మానవతా సేవకు గుర్తుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్,  లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. 

గానంతో ప్రాణదానం.. 

ఇండోర్ నగరంలో పుట్టి పెరిగిన ముచ్చల్..  కేవలం తన గాత్రంతోనే కాదు, తన మానవతా దృక్పథంతో వేలాది మంది జీవితాలలో వెలుగులు నింపుతోంది. ఆమె స్థాపించిన 'పాలక్ పలాష్ ఛారిటబుల్ ఫౌండేషన్' ద్వారా ఇప్పటివరకు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా 3,800 మందికి పైగా పేద పిల్లలకు గుండె శస్త్రచికిత్స చేయించారు. తన సంగీతం ద్వారా నిధులు సమకూర్చి వారి ప్రాణాలను కాపాడుతోంది. సంగీతంపై ఆమెకున్న అభిరుచిని, కరుణామయమైన జీవిత లక్ష్యంగా మార్చుకుని ముందుకు సాగుతున్నారు ముచ్చల్.

జీవితాన్ని మార్చిన క్షణం

పాలక్ యొక్క దాతృత్వ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. చిన్నతనంలో రైలు ప్రయాణం చేస్తుండగా ఆమె పేద పిల్లలను చూశారు .  ఆ ఒక్క క్షణం ఆమె జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక రోజు నేను వారికి తప్పకుండా సహాయం చేస్తాను అని ఆమె తనలో తాను నిశ్శబ్దంగా వాగ్దానం చేసుకున్నారు. సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆ వాగ్దానమే ఆమె ఫౌండేషన్‌కు ఫునాది పడింది. తన ప్రతి కచేరీ ఆదాయాన్ని , వ్యక్తిగత పొదుపును ప్రాణాలను కాపాడే వైద్య చికిత్సల కోసం వినియోగిస్తున్నారు.

 

కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు మద్దతుగా

ఈ గుండె ఆపరేషన్ల నిధుల సేకరణ కోసం ఆమె వేదికలపై పాటలు పాడేటప్పుడు, ఆమె ముందు ఒక చిన్న గుండెల బొమ్మతో కూడిన డొనేషన్ బాక్స్‌ను ఉంచుతారు. ఆ కచేరీకి వచ్చే ప్రేక్షకులు కేవలం ఆమె పాటను ఆస్వాదించడమే కాక, పరోక్షంగా ఒక చిన్నారి ప్రాణదాతలు అవుతారు.  ఆమె దాతృత్వం కేవలం ఈ ఒక్క చిన్నారుల గుండె చికిత్సలకే పరిమితం కాలేదు. గతంలో కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు మద్దతుగా నిలిచి అండగా ఉన్నారు.  గుజరాత్ భూకంప బాధితుల సహాయార్థం రూ. 10 లక్షలు అందించారు. ఆమె సామాజిక సంక్షేమం పట్ల నిబద్ధత, నిలకడైన చర్యల ద్వారానే ఇది సాధ్యమైందని చెప్పారు..

►ALSO READ | మహేష్-రాజమౌళి SSMB 29 అప్డేట్స్.. పృథ్వీరాజ్‌ లుక్‌, సంచారి సాంగ్ ఏం చెబుతున్నాయి?

 నిస్వార్థ సేవకు మద్దతుగా భర్త..

ఆమె భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు మిథూన్ కూడా ఆమె దాతృత్వ ప్రయాణంలో నిస్వార్థ భాగస్వామిగా నిలిచారు. ఒకవేళ షో లేకపోయినా, ఆదాయం లేకపోయినా..  ఒక బిడ్డకు జరగాల్సిన శస్త్రచికిత్స ఎప్పటికీ ఆగదు అని ఆయన తెలిపారు. ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ, ఈ లక్ష్యాన్ని సజీవంగా ఉంచాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు.  పాలక్ సోదరుడు పలాష్ ముచ్చల్ కూడా ఈ ఫౌండేషన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, పాలక్ యొక్క మిషన్‌కు అండగా నిలుస్తున్నారు. పాలక్ ముచ్చల్ కేవలం తన గాత్రంతోనే కాదు, తన మానవత్వంతో వేలాది మంది జీవితాలలో వెలుగులు నింపుతున్న నిజమైన 'మెలోడీ క్వీన్'గా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు.