అప్పుచేసైనా గెలవాలి.. సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు, భూములు, బంగారం తాకట్టు

అప్పుచేసైనా గెలవాలి.. సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు, భూములు, బంగారం తాకట్టు
  • మోస్తరు గ్రామాల్లోనూ రూ.20 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు
  • ఇక ప్రత్యేక గ్రామాల్లో కోటి రూపాయలకు తగ్గేదేలే!
  • పదవిపై మోజు, పలుచోట్ల భారీ ఆదాయ మార్గాలే కారణం
  • గ్రానైట్, రియల్​ ఎస్టేట్, ఇండస్ట్రియల్ ​
  • ఏరియాల్లోని పంచాయతీలకు ఫుల్ ​డిమాండ్
  • రిజర్వేషన్​ పంచాయతీలతో పోలిస్తే జనరల్ ​గ్రామాల్లో ఎక్కువ జోష్​
  • గెలవాలంటే ప్రలోభాలు తప్పవంటున్న అభ్యర్థులు
  • ఇలా షెడ్యూల్​ రాగానే అలా దావత్‌‌‌‌లు షురూ
  • ప్రచారం, పంపకాలతో కలిపి ఒక్కో అభ్యర్థి ఖర్చు తడిసి మోపెడు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో సర్పంచ్​ ఎన్నికలు చాలా కాస్ట్‌‌‌‌లీగా తయారయ్యాయి. ఒకప్పుడు సేవా మార్గంగా ఉండే సర్పంచ్‌‌‌‌గిరీ.. ఇప్పుడు  ప్రెస్టీజ్​ఇష్యూగా, ఆదాయమార్గంగా మారింది. దీంతో అనేక గ్రామాల్లో అభ్యర్థులు  ‘ఎలాగైనా గెలవాలె’ అనే పంతంతో  బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో లక్షలకు లక్షలు ఖర్చు  చేసేందుకూ ముందుకు వస్తున్నారు.  తమకున్న ఇండ్లు, వ్యవసాయ భూములు, ప్లాట్లు, చివరికి ఇల్లాలి ఒంటి మీది బంగారు నగలను సైతం బ్యాంకుల్లో, ప్రైవేటు సంస్థల్లో తాకట్టు పెడ్తున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ ఎన్నికల్లో వెదజల్లేందుకు రెడీ అయ్యారు. షెడ్యూల్ వచ్చిన నాటినుంచే గ్రామాల్లో ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు మందు, విందులతో దావత్‌‌‌‌లు ఇస్తున్నారు. ఇక పోలింగ్​ముందురోజు ఓటర్లకు పంపకాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో సర్పంచ్ ఎన్నికల ఖర్చు మహా అయితే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలలోపే ఉండేది. కానీ, ఇప్పుడు  సాధారణ గ్రామాల్లోనే ఇంతకు 3 నుంచి 4  రెట్లు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇక నగరాలు, పట్టణాల చుట్టూ ఉండే మేజర్ గ్రామ పంచాయతీలు, గ్రానైట్ క్వారీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, భారీ పరిశ్రమలు ఉన్న గ్రామాల్లో అయితే.. ఒక్కో అభ్యర్థి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసేందుకూ సై అంటున్నారు. 

ఈ గ్రామాలకు ఉన్న ఆర్థిక వనరులే ఈ విపరీతమైన పోటీకి, ఖర్చుకు ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ గెలిస్తే భవిష్యత్తులో రాజకీయంగా వచ్చే అవకాశాలు, ఆదాయ మార్గాలు ఎక్కువ ఉండడంతో వార్డు మెంబర్‌‌‌‌కు పోటీ చేస్తున్న వాళ్లు సైతం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా పెట్టేందుకు రెడీ అయ్యారు. వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 5 వేలు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా రూ. 2.50 లక్షలు,  వార్డు అభ్యర్థి రూ. 50 వేలు, ఆలోపే ఖర్చు చేయాలి.  5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్​ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు అభ్యర్థి రూ.30 వేలకు మించి ఖర్చు చేయడానికి వీలులేదు. కానీ ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా వివిధ వర్గాలకు రిజర్వ్​అయిన గ్రామాలతో పోలిస్తే జనరల్​పంచాయతీల్లో భారీగా ఖర్చు పెడ్తున్నారు. 

పదవి కోసం రిస్క్ 

ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతుండటంతో అభ్యర్థులు నిధుల  కోసం నానా తంటాలు పడుతున్నారు. లిక్విడ్ క్యాష్ చేతిలో లేకపోవడంతో స్థిరాస్తులను కదిలిస్తున్నారు.  వ్యవసాయ భూములను, ఇండ్లను తనఖా పెట్టి  లోన్లు  తెస్తున్నారు. నగదు కోసం మార్కెట్​ రేట్​ కంటే తక్కువకే  అగ్రిమెంట్ సేల్​ చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా, ఇంట్లోని ఆడవాళ్ల మెడలో పుస్తెల తాడును, బీరువాల్లోని బంగారాన్ని సైతం కుదువ పెడుతున్న  పరిస్థితులు గ్రామాల్లో కనిపిస్తున్నాయి.  ‘‘పదవి వస్తే అన్నీ తిరిగొస్తాయి.. పోతే అన్నీ పోతాయి’’ అనే తెగింపుతో కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి మరీ రిస్క్​ చేస్తున్నారు. ఇంకోవైపు బ్యాంకు రుణాలు ఆలస్యం అవుతుండటం, ఎన్నికల ఖర్చు రోజురోజుకూ పెరుగుతుండటంతో పలువురు అభ్యర్థులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వడ్డీ వ్యాపారులు ‘‘అడిగినంత ఇస్తాం.. కానీ వడ్డీ మాత్రం మేం చెప్పిందే’’ అంటూ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. నూటికి రూ. 3 నుంచి మొదలుకొని, అవసరాన్ని బట్టి రూ. 5, రూ. 10 వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారు.   

ఆ గ్రామాల్లో ‘కోట్ల’ కుమ్ములాట

ఇక నగరాలు, పట్టణాలకు ఆనుకొని ఉన్న మేజర్ పంచాయతీల కథే వేరు. అక్కడ సర్పంచ్ పదవి అంటే బంగారు గుడ్లు పెట్టే బాతులాగా మారింది.  రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్​మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగే ఈ ప్రాంతాల్లో.. అనుమతులు, ఎన్‌‌వోసీల ద్వారా సర్పంచ్‌‌లకు భారీగా ఆదాయం సమకూరుతుంది. దీంతో ఈ పంచాయతీలను దక్కించుకోవడానికి అభ్యర్థులు కోటి రూపాయలు పెట్టేందుకూ వెనుకాడటం లేదు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల శివారులోని గ్రామాలతోపాటు  రాష్ట్రంలోని ప్రధాన నగరాల చుట్టూ ఉన్న గ్రామాల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. రియల్టర్లే స్వయంగా బరిలోకి దిగుతుండటం లేదా తమ మనుషులను నిలబెడుతుండటంతో ఖర్చు ఆకాశాన్నంటుతున్నది. గ్రానైట్ క్వారీలు, క్రషర్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమలు ఉన్న గ్రామాల్లోనూ  సర్పంచ్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఇక్కడ గెలిచే సర్పంచ్‌‌లకు పరిశ్రమల నుంచి నెలవారీ మామూళ్లు, స్క్రాప్ కాంట్రాక్టులు  తదితర రూపాల్లో కోట్లాది రూపాయల ఆదాయం ఉంటున్నది.  కరీంనగర్, ఖమ్మంలాంటి జిల్లాల్లోని గ్రానైట్ ప్రభావిత గ్రామాల్లో సర్పంచ్ పదవి కోసం రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయడానికి అభ్యర్థులు వెనుకాడడం లేదు. 

ఇక్కడ ఎన్నికలు వెరీ కాస్ట్‌‌లీ

  •  మేడ్చల్​ మల్కాజ్‌‌గిరి జిల్లాలో పారిశ్రామిక వాడకు దగ్గరలో ఉన్న ఒక మేజర్ పంచాయతీలో స్థానికుల కంటే వలస కూలీల ఓట్లే కీలకం. ఇక్కడ సర్పంచ్‌‌గా గెలిచిన వారికి కంపెనీల నుంచి వచ్చే స్క్రాప్ కాంట్రాక్టులు, లేబర్ సప్లై,  నీటి సరఫరాలాంటి కాంట్రాక్టులు దక్కుతాయి. వీటి విలువ ఏటా కోట్లలో ఉంటుంది కాబట్టి, అభ్యర్థులు ఈ ఎన్నికను ఒక పెట్టుబడిలా భావిస్తున్నారు. కోటి రూపాయలు పోయినా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. 
  • యదాద్రి భువగనగిరి జిల్లాలో ఎలాంటి రియల్ ఎస్టేట్ గానీ, క్వారీలుగానీ లేని ఓ సాధారణ వ్యవసాయ గ్రామంలో కూడా ఒక్కో సర్పంచ్​ ఎన్నికల ఖర్చు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు దాటుతున్నది.  
  •  నిజామాబాద్​ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో రైస్​ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. గ్రామంలోని జనాలు వ్యవసాయ పనులు, ఇతర ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకునేటోళ్లే. అయినా ఈ గ్రామంలో ఖర్చు రూ.60 లక్షలు దాటుతోందని ఓ అభ్యర్థి పేర్కొన్నారు.
  •  కరీంనగర్​ సమీపంలో గ్రానైట్ ​క్వారీలు అధికంగా ఉండే ఓ గ్రామంలో సర్పంచ్​ పదవి కోసం గత ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఏకంగా రూ.50 లక్షలు  ఖర్చు చేశాడు. ఈసారి అదే గ్రామం జనరల్‌‌కు రిజర్వ్​ కావడంతో కోటి నుంచి రెండు కోట్లు పెట్టేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు. 

ఇక్కడ ఎన్నికలు వెరీ కాస్ట్‌‌‌‌లీ

  • రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మీదుగా కొత్త హైవే నిర్మాణం జరుగుతుండడంతో ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగాయి.  ప్రస్తుతం రియల్ ఎస్టేట్‌‌‌‌కు  హాట్‌‌‌‌స్పాట్‌‌‌‌గా మారిన ఈ గ్రామంలో తొలి విడతలో పోలింగ్​ జరగనుంది. ఇక్కడ గతంలో ఓ సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా రూ. 5 లక్షలు ఖర్చు చేస్తే ఈసారి ఇప్పటికే రూ. 70 లక్షలు  పెట్టినట్లు తెలిపాడు. మిగిలిన పోటీదారులదీ ఇదే పరిస్థితి. గెలిచిన తర్వాత వచ్చే లే అవుట్ పర్మిషన్లు, భవన నిర్మాణాల అనుమతులతో.. పెట్టిన పెట్టుబడికి నాలుగైదు రెట్లు తిరిగి​రావడం ఖాయమనే ధీమాలో అభ్యర్థులు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.
  •   ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ గ్రామంలో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మారిపోయాయి.  అందుకే ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు ఏకంగా కోటి రూపాయల వరకు ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. గతంలో ఒక్కో ఓటుకు 500 పంచారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో  రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పంచాల్సిన పరిస్థితి ఉందని పోటీలో ఉన్న అభ్యర్థి ఒకరు వాపోయారు.