బడ్జెట్: గ్రీన్ ఎనర్జీకి ‘పవర్’.. ఈ ఏడాది బడ్జెట్లో విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు కేటాయింపు

బడ్జెట్: గ్రీన్ ఎనర్జీకి ‘పవర్’.. ఈ ఏడాది బడ్జెట్లో విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు కేటాయింపు
  • వంద శాతం సోలార్​ పవర్​ గ్రామాల కోసం రూ.వెయ్యి కోట్లు
  • గ్రీన్​ ఎనర్జీ ప్రమోషన్​ కోసం మరో రూ.వెయ్యి కోట్లు
  • గృహజ్యోతి సబ్సిడీ కోసం రూ.2,080 కోట్లు
  • వ్యవసాయ రంగం ఇతర పవర్​ సబ్సిడీకి రూ.14 వేల కోట్లు
  • జెన్​కో, ట్రాన్స్​కో సంస్థలకు అదనంగా రూ.వెయ్యి కోట్ల చొప్పున అలొకేట్ 

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రాన్ని గ్రీన్​ ఎనర్జీ దిశగా నడిపించడానికి పవర్​ సెక్టార్​లో మార్పులు చేసినట్టు డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్​ శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఈ దిశగా బడ్జెట్​ కేటాయింపుల్లో స్పష్టమైన మార్పులు చేశారు. గతేడాది కంటే ఈసారి బడ్జెట్​లో విద్యుత్​ శాఖకు రూ.21,285 కోట్లు కేటాయించారు. ఇందులో ఎస్టాబ్లిష్​మెంట్​ కోసం రూ.737 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు. ‘చీకటి పోవడం అంటే కేవలం వెలుగు రావడం కాదు.. ప్రజల్లో నమ్మకం పెరగడం’ అని భట్టి వ్యాఖ్యానించారు.

  • గ్రామాల్లో వంద శాతం సోలార్​ పవర్​..

గ్రీన్​ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో వంద శాతం సోలార్​ పవర్​ గ్రామాలను తయారు చేయడానికి ప్రభుత్వం ఈ సారి బడ్జెట్​లో రూ.వెయ్యి కోట్లు, గ్రీన్​ ఎనర్జీ ప్రమోషన్, ఇతర వర్కుల కోసం మరో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. ‘ఇందిర సౌర జల వికాసం’ పథకం కింద షెడ్యూల్డ్​ తెగల(గిరిజనులు) రైతులు వ్యవసాయం చేసుకునే 2.10 లక్షల మంది గిరిజన రైతులకు వంద శాతం సబ్సిడీపై సోలార్​ పంప్​ సెట్లు అందించనున్నారు. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించగా,  దీని విధివిధానాలు అధ్యయనం చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని భట్టి తెలిపారు. 

‘‘మహేశ్వరం, చౌటుప్పల్​ ఏరియాలో రూ.11,460  కోట్లతో 1,500 మెగావాట్స్​ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమిట్ సందర్భంగా టీజీ  జెన్కో ద్వారా 11,460 మెగావాట్ల పంప్డ్​  స్టోరేజ్, ఇతర ప్రాజెక్టులకు రూ.95,150  కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం.. రెడ్ కో ద్వారా రూ.లక్షా 23 వేల 350 కోట్ల పెట్టుబడులతో 12 ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం’’ అని భట్టి తెలిపారు. ఇవి కేవలం పెట్టుబడులు కాదని, భవిష్యత్తు రాష్ట్ర పవర్​ సెక్టార్​ నిర్మాణానికి పునాదులని వివరించారు.

  • పవర్​ సబ్సిడీకే రూ.16,080 కోట్లు

రాష్ట్రంలో ప్రభుత్వం 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్, రైతులకు ఉచిత 24 గంటల వ్యవసాయ కరెంట్​ సరఫరా చేస్తోంది. ఈ రెండు స్కీమ్​లతో పాటు ఇతర సబ్సిడీల కోసం రూ.16,080 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 53 లక్షల 9 వేల పేద, మధ్య తరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి విద్యుత్​ సంస్థలకు గతేడాది రూ.3,900 కోట్లు చెల్లించడం విశేషం.