- ఇందులో కేంద్ర బలగాలకే రూ.1.73 లక్షల కోట్లు
- తొలి దశ జనగణనకు రూ.6 వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం.. బార్డర్‌లో కాపలా కాసే సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్‌కు భారీగా నిధులు పెంచింది. పోయినేడాది బడ్జెట్‌లో హోంశాఖకు రూ.2.33 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2.55 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో అత్యధికంగా రూ.1.73 లక్షల కోట్లను కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ లాంటి వాటికే అలకేట్ చేసింది.
ఇందులో సీఆర్పీఎఫ్‌కు రూ.38,517.9 కోట్లు, బీఎస్‌ఎఫ్‌కు రూ.29,567.64 కోట్లు, సీఐఎస్‌ఎఫ్‌కు రూ.15,973.85 కోట్లు, ఐటీబీపీకి రూ.11,324.08 కోట్లు, ఎస్‌ఎస్‌బీకి రూ.10,984.51 కోట్లు, అస్సాం రైఫిల్స్‌కు రూ.8,796.68 కోట్లు కేటాయించింది. ఇక ఎప్పటికప్పుడు దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కు కూడా కేంద్రం నిధులు పెంచింది.
ఐబీకి పోయినేడు బడ్జెట్‌లో రూ.4,159 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.6,782.43 కోట్లు కేటాయించింది. ఢిల్లీ పోలీస్ విభాగానికి రూ.12,503 కోట్లు, జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగానికి రూ.9,925.50 కోట్లు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కు రూ.499.99 కోట్లు అలకేట్ చేసింది. కాగా, తొలి విడత జనగణన కోసం రూ.6 వేల కోట్లను కేంద్రం బడ్జెట్‌లో అలకేట్ చేసింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి తొలి దశ జనగణన జరగనుంది.
సౌలతుల కల్పనకు ప్రాధాన్యం..
బార్డర్‌లో సౌలతుల కల్పన, పోలీస్ విభాగంలో సంస్కరణలు, సౌకర్యాల కల్పనకు కూడా కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. బార్డర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్‌మెంట్ కోసం రూ.5,576.51 కోట్లు, పోలీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.5393.37 కోట్లు అలకేట్ చేసింది.
ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో స్పెషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ ఫర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిస్ట్, సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్ కోసం రూ.3,610.80 కోట్లు కేటాయించింది. రాష్ట్ర పోలీస్ బలగాల్లో సంస్కరణలు, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ కోసం రూ.450.54 కోట్లు అలకేట్ చేసింది.
వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌కు రూ.650 కోట్లు, జైళ్ల ఆధునీకరణకు రూ.300 కోట్లు, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీకి కలిపి రూ.665.40 కోట్లు కేటాయించింది.
