హైదరాబాద్ నాగోల్లో అధిక వడ్డీ ఆశ చూపి రూ.30 కోట్లకు ముంచేశారు !

హైదరాబాద్ నాగోల్లో అధిక వడ్డీ ఆశ చూపి రూ.30 కోట్లకు ముంచేశారు !

ఎల్‌‌బీనగర్‌‌, వెలుగు: అధిక వడ్డీ, పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కాజేసిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్‌‌లోని నాగోల్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. నాగోల్‌‌ సీఐ మహ్మద్‌‌ మక్బూల్‌‌ జాన్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ఆనంద్‌‌నగర్‌‌కు చెందిన కిచ్చ వీరభద్రరావు (51) తన భార్య రాజ్యలక్ష్మి, మరో వ్యక్తి వెంకట దుర్గాప్రసాద్‌‌తో కలిసి నాగోల్ డివిజన్‌‌లోని రోడ్ నంబర్‌‌ 13లో వీరభద్ర ట్రేడింగ్‌‌ పేరుతో 2024 జూన్‌‌లో ఓ ఆఫీస్‌‌ ఓపెన్‌‌ చేశాడు. తమ సంస్థలో రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున వడ్డీ ఇస్తామని పలువురిని నమ్మించాడు.

మొదట కొందరు పెట్టుబడి పెట్టడంతో వారికి సక్రమంగా వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. ఇలా వీరి సంస్థలో 290 మంది రూ.30 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలోనే వీరభద్రరావుపై 2025 మేలో గుర్గాంలో ఓ సైబర్‌‌ క్రైమ్‌‌ కేసు నమోదైంది. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. 

పెట్టుబడి పెట్టిన వారి నుంచి ఒత్తిడి రావడంతో రూ. 15 కోట్లు చెల్లించి.. మరో రూ. 15 కోట్ల చెల్లింపులు ఆపేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరభద్రరావుతో పాటు అతడి భార్య రాజ్యలక్ష్మి, మరో వ్యక్తి మహ్మద్‌‌ మక్భూల్‌‌ జాన్‌‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌కు తరలించారు.