హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు వాటర్‌బోర్డుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.3305 కోట్లు కేటాయించింది. బోర్డు పరిధిని ఓఆర్ఆర్వరకూ విస్తరించడంతో ఆయా ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేసే భారం తమపై పడిందని, ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న పనులతో పాటు, ప్రాజెక్టులకు సైతం భారీగా నిధుల అవసరం ఉందని, బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాల్సిందిగా వాటర్‌బోర్డు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ప్రభుత్వం రూ.3305 కోట్లు కేటాయించింది. గ్రేటర్‌పరిధిలో ప్రతి వినియోగదారుడికి 20 కి.లీ. వరకు ప్రతి నెలా ఉచితంగా నీటి సరఫరా జరుగుతోంది. ఈ పథకానికి ఏడాదికి రూ.5 కోట్ల వరకు బోర్డుపై భారం పడుతోంది. ప్రభుత్వం రీయింబర్స్మెంట్మెంట్కింద బోర్డుకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.300 కోట్లు కేటాయించింది. నాగార్జున సాగర్‌లో డెడ్‌స్టోరేజీ ఉన్నా నగరానికి పంపింగ్అవసరం లేకుండా నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.1000 కోట్లు కేటాయించింది. కొంతకాలంగా నిధుల లేకపోవడంతో ఈ పనులు నత్తనడకన నడుస్తున్నాయి.
వచ్చే వేసవి నాటికి సుంకిశాల పూర్తి
ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వచ్చే వేసవి నాటికి సుంకిశాల ప్రాజెక్టును పూర్తి చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఇక ఓఆర్ఆర్పరిధిలోని ప్రాంతాలన్నీ బోర్డులో విలీనం అయిన నేపథ్యంలో కొత్తగా నిర్మించే పైప్లైన్లు, రిజర్వాయర్లు, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.1450 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రాబోయే కాలంలో తాగునీటి వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఇక గ్రేటర్‌పరిధిలో కొత్తగా చేరిన ప్రాంతాల్లో సీవరేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కొత్త డ్రైనేజీ వ్యవస్థలతోపాటు, ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల నిర్మాణాలను చేపట్టేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రాబోయే వర్షాకాలంలో సీవరేజీ సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఆయా పనులకు గాను ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.555 కోట్లు కేటాయించింది. బడ్జెట్కేటాయింపుల పై ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేటాయింపులు ఇలా
- సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్ట్‌కు రూ 1,000 కోట్లు
- మౌలిక సదుపాయాల అభివద్ధి పనులకు రూ.1,450 కోట్లు
- సీవరేజీ పనుల కోసం రూ.555 కోట్లు
- ఉచిత తాగునీటి పథకం రీయింబర్స్‌మెంట్ కోసం రూ.300 కోట్లు
