పంచాయతీలకు రూ.339 కోట్లు విడుదల

పంచాయతీలకు రూ.339 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 8 నెలల పాటు ప్రతి నెల కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి రూ.339 కోట్లు విడుదల చేస్తామని గతంలో సీఎం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా గత నెల 4న యాక్షన్ ప్లాన్ ప్రారంభానికి ముందు నిధులు విడుదల చేశారు. ఈ నెలకు సంబంధించి తాజాగా నిధులు విడుదల చేస్తూ పంచాయతీ రాజ్ కమిషనర్ రఘనందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో కేంద్ర ఆర్థిక సంఘ నిధులు రూ.203 కోట్లు ఉండగా, రాష్ట్ర ఆర్థిక సంఘ నిధులు రూ.136 కోట్లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ నిధులను 32 జిల్లాలకు(హైదరాబాద్ మినహా ) కేటాయించారు.

గత నెల యాక్షన్ ప్లాన్ లో వేలాది మంది సర్పంచ్ లు ప్రభుత్వ నిధులు సరిపోకపోవటంతో అదనంగా లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ నిధులతో వారి బకాయిలను చెల్లించే అవకాశాలు కనపడుతున్నాయి.  రాష్ట్రంలోని 6 జిల్లాల్లోని 17 ఏజెన్సీ గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు పంచాయతీల లిస్ట్ నుంచి గత ఏడాది  తొలగించారు. ఈ గ్రామాల్లో ఇటీవల పంచాయతీ ఎన్నికలు సైతం జరగలేదు. వీటికి ఈ నెల నిధులు విడుదల చేశారు. గత నెల విడుదల చేసిన నిధులలో ఈ  గ్రామాలను ప్రస్తావించని ప్రభుత్వం ఈసారి ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించి నిధులు విడుదల చేసింది.