
- ఒడిశా నుంచి యూపీకి గంజాయిని తరలిస్తున్న ముఠా
- శంషాబాద్‌లో 847 కిలోల గంజాయిని పట్టుకున్న ఈగల్ టీమ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లపై ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) టీమ్ స్పెషల్ ఆపరేషన్లు ముమ్మరం చేసింది. ఏపీ, ఒడిశా ఏజెన్సీల నుంచి హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలకు చెక్ పెడుతున్నది.
ఇందులో భాగంగా ఖమ్మం, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులతో కలిసి సోమవారం జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఒడిశా నుంచి ఉత్తర ప్రదేశ్ తరలిస్తున్న రూ.4.2 కోట్ల విలువ చేసే 847 కిలోల గంజాయి, బొలెరో వాహనాన్ని శంషాబాద్‌లో స్వాధీనం చేసుకున్నది. ఒడిశాకు చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. ఎస్పీ రూపేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ వివరాలను టీజీ ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా మంగళవారం వెల్లడించారు.
సిండికేట్లుగా గంజాయి స్మగ్లర్లు
ఒడిశా మల్కన్‌గిరికి చెందిన రమేశ్ సుకురి, యూపీకి చెందిన షఫీక్‌తో కలిసి గంజాయి సిండికేట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో మల్కన్‌గిరి ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఖిల్లా ధన(29), రాజేందర్ బజింగ్(26), జగదీశ్ కుల్దీప్, షిబో, బసులతో గంజాయి ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశారు.
పోలీసులకు చిక్కకుండా ట్రాన్స్‌పోర్ట్ చేయడంలో ఖిల్లాధన, రాజేందర్ బజింగ్‌కు అనుభవం ఉంది. ఇలా ఈ ఏడాదిలో 350 కిలోలు, 500 కిలోలు, 600 కిలోల చొప్పున 3 సార్లు యూపీకి గంజాయి తరలించారు. యూపీకి చెందిన గంజాయి డీలర్ షఫీక్ ఆర్డర్లతో ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ ఓఆర్‌ఆర్ మీదుగా యూపీ, కర్నాటకకు తరలించేవారు. ఈ సిండికేట్‌లో ఖిల్లా ధన, రాజేందర్ బజింగ్ ట్రాన్స్‌పోర్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
స్మగ్లర్ల చేతుల్లో బేసిక్ ఫోన్లే
ఈ ముఠా సభ్యులందరూ సిండికేట్ ఆధారాలు పోలీసులకు చిక్కకుండా స్మార్ట్ ఫోన్లకు బదులు బేసిక్ ఫోన్లను మాత్రమే వాడుతున్నారు. ఈ క్రమంలోనే గత పదిరోజుల క్రితం యూపీ డీలర్ షఫీక్ రాజమండ్రికి వెళ్లాడు. పెద్ద మొత్తంలో గంజాయి ఆర్డర్ చేశాడు.
సప్లయర్ రమేశ్.. సిండికేట్ పథకం ప్రకారం బ్రౌన్ కలర్ టేప్‌తో చుట్టిన 847 కిలోల 411 గంజాయి ప్యాకెట్లను 26 బ్యాగుల్లో ప్యాకింగ్ చేశాడు. వీటితో ఖిల్లా ధన, రాజేందర్ మల్కాన్‌గిరి నుంచి సోమవారం తెల్లవారుజామున బయలుదేరారు. ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న ఈగల్ టీమ్ నిఘా పెట్టింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో శంషాబాద్ రోడ్‌లోని జామా మసీదు వద్ద వారిని పట్టుకుంది.