రూ.5 భోజ‌నం సూప‌ర్ హిట్.. 10 కోట్లు దాటిన మార్క్

రూ.5 భోజ‌నం సూప‌ర్ హిట్.. 10 కోట్లు దాటిన మార్క్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అన్నపూర్ణ ఫుడ్ స్కీమ్' కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 2014లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ప్రవేశపెట్టిన ఈ సబ్సిడీ భోజన కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 10.45 కోట్ల భోజనాలను అందించి రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ ఆహార పథకం ద్వారా అన్నం (400 గ్రాములు), సాంబారు (120 గ్రాములు), కూర (100 గ్రాములు), ఊరగాయ (15)తో కూడిన సరసమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. కేవలం రూ. 5 నామమాత్రపు ఛార్జీతో అన్ని వర్గాల ప్రజలకు భోజనాన్ని అందిస్తున్నారు.

GHMC డేటా ప్రకారం, ప్రస్తుతం, ఈ పథకం కింద నగరంలో రోజుకు సుమారు 30వేల మందికి భోజనాలు వడ్డిస్తున్నారు. దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఫీడింగ్ ప్రోగ్రామ్‌లలో ఒకటైన ఈ భోజనంపై రోజువారీ వేతన కార్మికులే కాదు, చాలా మంది విద్యార్థులు, క్యాబ్/ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులు మొదలైనవారు కూడా దీనిపై ఆధారపడి ఉన్నారు.

ఇటీవలి కాలంలో రూ.5కే భోజనం అందిస్తున్న కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తుండడంతో కొన్నిచోట్ల సీటింగ్ సౌకర్యం కూడా కల్పించారు. మాదాపూర్‌లోని అన్నపూర్ణ క్యాంటీన్ లో సీటింగ్ ఏర్పాట్లను సమకూర్చారు. ఇక్కడ చాలా మంది ఉద్యోగులు క్రమం తప్పకుండా భోజనం చేస్తారు. అదేవిధంగా గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో ఉన్న అన్నపూర్ణ సెంటర్‌లోనూ భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు చాలా మంది భోజనాలు చేస్తున్నారు.

కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ల సమయంలో పేదలకు అన్నపూర్ణ ఆహార పథకం పేదలకు చాలా ఉపయోగపడింది. ఆ కఠినమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అన్నపూర్ణ భోజనాన్ని ఉచితంగా అందించింది. వడ్డించే భోజనాల సంఖ్యను కూడా పెంచింది. మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనం కూడా అందించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 150 కేంద్రాలు రూ.5కే భోజనాన్ని అందిస్తున్నాయని, 32 చోట్ల సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రతిపాదించగా, వాటిలో 15 ఇప్పటికే సిద్ధం అయ్యాయి.