పదే పదే పైపు లైన్ల మార్పు.. రూ.50 కోట్లు మట్టిపాలు

పదే పదే పైపు లైన్ల మార్పు.. రూ.50 కోట్లు మట్టిపాలు

మందమర్రి,వెలుగునేషనల్​ హైవే మంజూరయినట్టు తెలిసినా పట్టించుకోకుండా పాత రోడ్ల పక్కనే మిషన్​ భగీరథ పైపులైన్లను వేశారు. హైవే పనులు మొదలు కావడంతో ఆ పైపులైన్లను మారుస్తున్నారు. దీనివల్ల రూ. 50 కోట్ల వరకు వృథా కాగా.. చాలా ఊళ్లకు మంచినీళ్లు ఇవ్వడం కష్టం కానుంది. ఇంటర్నల్​ పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం పూర్తయినా మెయిన్​ పైప్​ లైన్​ మారుస్తుండడం వల్ల  ఆయా గ్రామాలకు నీరందించడంలో జాప్యం జరుగనుంది.

ఎన్​హెచ్​ 363 రెండు జిల్లాల్లో.. 

మంచిర్యాల నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్​ వరకు కేంద్ర ప్రభుత్వం 2016లో కొత్తగా నేషనల్​ హైవే  363 మంజూరు చేసింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాల్లో 94.6 కిలోమీటర్ల రోడ్డును ఫోర్​లేన్​గా మార్చేందుకు మొదటివిడతగా రూ.1700 కోట్లను కేటాయించింది.  ఈ పనులను రెండు ప్యాకేజీల కింద చేపట్టనుంది. మంచిర్యాల జిల్లా  శ్రీ రాంపూర్​ జీఎం ఆఫీస్​ నుంచి రేపల్లె వాడ వరకు మొదటి ప్యాకేజీ రోడ్డు పనులను రూ.1,042 కోట్లతో చేపడుతోంది. రేపల్లె వాడ నుంచి రెబ్బెన, ఆసిఫాబాద్​, వాంకిడి మీదుగా మహారాష్ట్ర బార్డర్​ వరకు రెండవ ప్యాకేజీ పనులను  రూ.910 కోట్లతో చేపట్టనుంది. నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా ఆధ్వర్యంలో మొదటి ప్యాకేజీ పనులను ఎంఆర్​ఆర్​పీఎల్​ ప్రైవేటు లిమిటెడ్​ సంస్థ చేస్తోంది. మంచిర్యాల నుంచి రేపల్లెవాడ వరకు ఇప్పుడున్న ఆర్​అండ్​బీ రోడ్డును  ఇరువైపుల విస్తరించే పనులు సాగుతున్నాయి. ఫోర్​లేన్​తో పాటు ఆర్వోబీలు, అండర్​పాస్​లు, సర్వీసు రోడ్లు, డివైడర్లు నిర్మాణం కోసం ప్రస్తుతం రోడ్డు పక్కనున్న వాటర్​ సప్లై పైపులైన్లు, కరెంటు స్తంభాలు, హైటెన్షన్​ టవర్లు, టాన్స్​ఫార్మర్లను తొలగిస్తున్నారు.

ముందే తెలిసినా.. రోడ్డుపక్కనే పైపులైను

నేషనల్​ హైవే మంజూరయిన విషయం తెలిసినా మిషన్​ భగీరథ అధికారులు మూడేండ్ల కిందట పాత రోడ్ల పక్కనే పైప్​లైన్లు ​ వేశారు. ఆర్​ అండ్​బి రోడ్డుకు 30, 40 అడుగుల దూరంలోనే  వేశారు. ఊళ్లలో కేవలం 20, 25 అడుగుల దూరంలోనే వేశారు. దీంతో ఇప్పుడు ఆ పైపులైన్లు హైవే కిందకు వస్తున్నాయి. భగీరథ పైపులైను వేసినప్పుడే నేషనల్​ హైవే అధికారులు అభ్యంతరం తెలిపినా పంచాయతీరాజ్​ ఆఫీసర్లు పట్టించుకోలేదు. వాంకిడి మండలం గోయగాం నుంచి ఆసిఫాబాద్​, రెబ్బెన, తాండూరు, బెల్లంపల్లి వరకు , మంచిర్యాలలోని ఎంసీసీ నుంచి మందమర్రి, బెల్లంపల్లి చర్చివరకు మొయిన్​పైపులైనంతా రోడ్డు పక్కనే నిర్మించారు. ఈ ప్రాంతంలో  విస్తరణ కోసం చేపట్టిన ప్రైమరీ వర్క్స్​ నిలిపివేసి.. వెంటనే పైపులైను తొలగించాలని నేషనల్​ హైవే అథారిటీ ఆఫీసర్లు స్పష్టం చేశారు. దీంతో సుమారు 54 కిలోమీటర్ల మేరకు   మెయిన్ ​పైపులైన్లను తొలగించి..  రోడ్డుకు 100 అడుగుల దూరంలో కొత్తలైను వేయాలని పంచాయతీరాజ్ అధికారులు నిర్ణయించారు. ​ మెయిన్​ పైపులైను మార్చేందుకు దాదాపు రూ 50 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఊర్లల్లో ఇంటర్నల్​ పైపులైన్ల పనులు  పూర్తి అయ్యాయి. ట్యాంకుల నిర్మాణం తుదిదశకు చేరుకుంది. కొన్ని గ్రామాల్లో ట్రయల్స్​ కూడా జరిగాయి. ఈ దశలో మెయిన్​ పైపులైను మార్చడం వల్ల తాగునీటి సరఫరా మరింత లేట్​కానుంది.

రూ. 50 కోట్లు వృథా

నేషనల్​ హైవే 363  మంజూరైన  విషయం తెలిసినా ఆర్​అండ్​బీ రోడ్డుపక్క 30 నుంచి 50 అడుగుల దూరంలో మొయిన్​పైపులైను వేశారని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ రఘునాథ్​ వెరబెల్లి, నియోజకవర్గ ఇన్​చార్జి అందుగుల శ్రీనివాస్​ ఆరోపించారు. వారు పైపులైను పనులను పరిశీలించారు. పైపు లైను మార్చడంవల్ల  రూ.50కోట్ల ప్రజాధనం దుబారా అవుతుందన్నారు. ఈ పనుల్లోనూ అధికార పార్టీ నాయకులు కమీషన్లు దండుకునే అవకాశం ఉందన్నారు.

సిటీ బస్సులు స్టార్ట్ అయ్యాకే మెట్రో