- ఎన్నికల ముందు తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
- ఓటమి భయంతోనేనని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు
చెన్నై: కలైంగర్ మహిళా హక్కు పథకం కింద 1.31 కోట్ల మంది మహిళా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో రూ.5 వేల చొప్పున జమ చేసినట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. నెలకు రూ.వెయ్యి చొప్పున ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్నెలలకు సంబంధించి రూ.3 వేలు.. వేసవిలో ఖర్చుల కోసం (సమ్మర్ స్పెషల్) అదనంగా మరో రూ. 2 వేలు చేర్చి మొత్తం రూ.5వేలు అందజేచేసినట్టు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే, ఆయన ఓ వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు.
‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని అడ్డుకోవాలని చూశారు. కానీ, నేను ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. అందుకే మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన డబ్బులను కూడా ముందే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘మీ పిల్లల విద్య అవసరాలు, మందులు లేదా అవసరమైన ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవాలని నేను సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని స్టాలిన్పేర్కొన్నారు.
అలాగే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తే ఈ నెలవారీ గ్రాంట్‌ను రూ. వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతామని ఆయన ప్రకటించారు. కాగా, ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఓటమి భయంతోనే సీఎం స్టాలిన్ముందస్తుగా మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేశారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
తమిళనాడులో 2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం.. సెప్టెంబర్ 2023 నుంచి కలైంగర్ మహిళా హక్కు పథకం పేరుతో మహిళలకు నెలకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తున్నది. ప్రారంభంలో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 1.13 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 1.31 కోట్లకు చేరింది.
