
- పాపులర్ హోటల్‌లో ఒక్క రాత్రి కోసం రూ.7 లక్షల వరకు పెరిగిన రూమ్ ధర
- ఫుల్ డిమాండ్ ఉందంటున్న హోటల్ కంపెనీలు
- పాపులర్ డెస్టినేషన్లలో ధరలు మరింత పైకి
న్యూఢిల్లీ: ఇయర్ ఎండ్ కావడంతో పాపులర్ హోటల్స్‌లో రూమ్ రేట్లు భారీగా పెరిగాయి. ఢిల్లీ, జైపూర్, ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లో రూమ్ రేట్లు రికార్డ్ లెవెల్‌కు చేరుకున్నాయని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఉదయ్‌పూర్‌లోని తమ హోటల్‌లో డిసెంబర్ 31 కోసం రూమ్స్ ఖాళీగా లేవని, అదే క్రిస్మస్ రోజున రూ.1,06,200 చార్జ్ చేశామని చెప్పారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారలో డిసెంబర్ 31 కోసం సింగిల్ నైట్‌కు రూ.1,20,000 వసూలు చేస్తున్నారు. ‘మా హోటల్స్‌లోని మహారాజా సూట్స్ కోసం చాలా ఎంక్వైరీలు వచ్చాయి.
వీటి ధర ఒక రాత్రికి రూ.7 లక్షలు ఉంటుంది’ అని కంపెనీ డైరెక్టర్ రజత్ గెరా అన్నారు. డొమెస్టిక్ టూరిస్ట్‌లు చివరి నిమిషంలో ప్లాన్ చేసుకుంటున్నారని, ఇంటర్నేషనల్ టూరిస్ట్‌ల నుంచి కూడా డిమాండ్ పెరగడంతో రూమ్ రేట్లు భారీగా పెరిగాయని వెల్లడించారు. అడ్వాన్స్‌గా బుక్ చేసుకోని వారు ప్రీమియం చెల్లించడానికి కూడా వెనకడుగు వేయడం లేదని చెప్పారు. డబుల్‌ట్రీ బై హిల్టన్ గోవా, హిల్టన్ గోవా రిసోర్ట్ కండోలిమ్, డబుల్‌ట్రీ బై హిల్టన్ గోవా – అర్పోరా–బాగాలో రేట్లు రికార్డ్ లెవెల్‌కు చేరుకున్నాయని హిల్టన్ హోటల్స్, గోవా డైరెక్టర్ ఆకాశ్ కాలియా అన్నారు. రూమ్ రేట్లు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని, ఇంటర్నేషనల్ టూరిస్ట్‌లు వస్తుండడం, ఎయిర్‌లైన్ కంపెనీలు తమ ఇంటర్నేషనల్ రూట్లను తిరిగి ఓపెన్ చేయడంతో డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఇండియాలో టూరిస్ట్‌లకు టాప్ డెస్టినేషన్‌గా గోవా కొనసాగుతోందని అన్నారు. తమ ప్రాపర్టీలలో రేట్లు ఆల్ టైమ్ గరిష్టాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
40 శాతం అప్
కొన్ని పాపులర్ డెస్టినేషన్లలో హోటల్ రేట్లు 40 శాతానికి పైగా పెరిగాయని హిల్టన్ (ఇండియా) డైరెక్టర్ మనిష్ తొలాని అన్నారు. ట్రావెల్ చేయడానికి కన్జూమర్లు చేసే ఖర్చులు పెరగడంతో హోటల్ రూమ్ రేట్లు పెరిగాయని వెల్లడించారు. సిటీల్లోని తమ హోటల్స్‌లో కూడా ఫుల్ డిమాండ్ కనిపిస్తోందని, ముందుగా ప్లాన్ చేసుకోని వారు ప్రీమియం చెల్లించి మరీ రూమ్స్ బుక్ చేసుకుంటున్నారని అన్నారు. తమకు నచ్చిన సిటీలలో తమ కుటుంబాలతో డిసెంబర్ 31 రోజును గడపడానికి ఖర్చుకు వెనుకాడడం లేదని వివరించారు. డిసెంబర్ 31 కోసం తమ దగ్గర ఎటువంటి రూమ్స్ ఖాళీ లేవని జేడబ్ల్యూ మారియట్ ముస్సోరి వాల్‌నట్ ఓనర్ రాజ్ చోప్రా వెల్లడించారు. తమ రూమ్ రేట్లు సింగిల్ నైట్ కోసం రూ.32 వేల వరకు ఉన్నాయని చెప్పారు.
ఇప్పటి వరకు ఎప్పుడూ లేని డిమాండ్ ఈసారి చూస్తున్నామని వ్యందమ్ హోటల్స్ అండ్ రిసోర్ట్స్ మార్కెటింగ్ ఎండీ నిఖిల్ శర్మ అన్నారు. కొన్ని లొకేషన్లలో డిసెంబర్ 31 కోసం రేట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ముస్సోరి, కసౌలి, ఉదయ్‌పూర్, కొచ్చి, అమృత్‌సర్, గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ద్వారకాలోని తమ హోటల్స్‌లో రూమ్ రేట్లు భారీగా పెరిగాయని అన్నారు. ఉదయ్‌పూర్‌లోని జానా లేక్ రిసార్ట్‌లో రూమ్ రేట్లు కిందటేడాదితో పోలిస్తే పెరిగాయని ఈ హోటల్ సీఈఓ అఖిల్ అరోరా పేర్కొన్నారు. రెండు రోజుల స్టే కోసం రూ.55 వేలు చార్జ్ చేస్తున్నామని వెల్లడించారు. మైసూర్, కబినిలో తమ రిసార్ట్‌లలో డిసెంబర్ 31 కోసం రూమ్ రేట్లు రికార్డ్ లెవెల్‌కు చేరుకున్నాయని రాయల్ ఆర్చిడ్ ఎండీ చందర్ కే బల్జీ అన్నారు.