పనుల పరిశీలనకు 15 జిల్లాలకు బృందాలను పంపాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అక్రమాలపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో మరిన్ని బృందాలను పంపుతామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ప్రకటించింది. జూన్ 9 నుంచి 12 వరకు పర్యటించిన కేంద్ర బృందం.. రాష్ట్రంలో సుమారు రూ.700 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించిన విషయం తెలిసిందే. కేంద్ర బృందం తన పర్యటనలో పలు అంశాలను వెల్లడించింది.
అనుమతి లేకుండా కల్లాల నిర్మాణం, చిన్న తరహా నీటి చెరువుల్లో పూడిక తీయడం, మైదాన ప్రాంతాల్లో కందకాలు చేపట్టడం లాంటి పనులను మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టినట్లు గుర్తించింది. ఉన్నత స్థాయిలో సాంకేతిక అనుమతులు పొందకుండా ఇలా స్కీమ్ గైడ్ లైన్లను ఉల్లంఘించి పనులు చేపట్టడాన్ని కేంద్రం దృష్టికి ఆ బృందం తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 15 జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తాయి.
