ఒక్క రోజులో రూ.8 లక్షల కోట్లు ఉఫ్‌‌‌‌..టారిఫ్ టెన్షన్ తో మార్కెట్లు కుదేల్

ఒక్క రోజులో  రూ.8 లక్షల కోట్లు ఉఫ్‌‌‌‌..టారిఫ్  టెన్షన్ తో మార్కెట్లు కుదేల్
  •   టారిఫ్​ టెన్షన్​తో భారీగా పతనమైన స్టాక్​ మార్కెట్​
  •     గత నాలుగు సెషన్లలో రూ.9 లక్షల కోట్లు హాంఫట్​
  •     గురువారం 264 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 
  •     టీసీఎస్‌‌‌‌, ఇన్ఫోసిస్‌‌‌‌, రిలయన్స్ షేర్లలో అమ్మకాలు

ముంబై: రష్యా ఆయిల్​ కొంటున్నందుకు ఇండియాపై అదనంగా 500 శాతం టారిఫ్​ వేసే బిల్లుకు ట్రంప్​ ఓకే చెప్పడంతో  సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ గురువారం దారుణంగా నష్టపోయాయి. గ్లోబల్ టెన్షన్లు పెరగడంతో    ఏకంగా 1.7 శాతం వరకు పడ్డాయి. సెషన్ ఆఖరులో నష్టాలను కొంత తగ్గించుకోగలిగాయి.  బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్‌‌‌‌ 780 పాయింట్లు (0.91 శాతం) నష్టపోయి 84,181 వద్ద, నిఫ్టీ 264 పాయింట్లు (1 శాతం) పడి  25,877 వద్ద ముగిశాయి. ఈ ఒక్క సెషన్‌‌‌‌లోనే సుమారు రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 1,581 పాయింట్లు (1.84 శాతం) పడగా, ఇన్వెస్టర్లు  రూ.9.18 లక్షల కోట్లు కోల్పోయారు.  బ్రెంట్ క్రూడాయిల్ గురువారం బ్యారెల్‌‌‌‌కు 60.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌‌‌‌‌‌‌‌తో రూపాయి విలువ 3 పైసలు తగ్గి 89.90 వద్ద సెటిలయ్యింది. 

ట్రంప్‌‌‌‌ టారిఫ్ బెదిరింపులతో సూచీలు బెంబేలు

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై అదనపు టారిఫ్‌‌‌‌లు వేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. రష్యా నుంచి ఆయిల్  కొంటున్న ఇండియా, చైనా, బ్రెజిట్ వంటి దేశాలపై 500 శాతం వరకు టారిఫ్ వేయనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రెసిడెంట్ ట్రంప్ ఆమోదించారు.  రష్యా ఆయిల్ కొంటున్నందుకు ప్రస్తుతం ఇండియాపై అదనంగా 50 శాతం వరకు టారిఫ్‌‌‌‌ను అమెరికా వేస్తోంది. దీనికితోడు ఇండియా, అమెరికా మధ్య ట్రేడ్ టెన్షన్లు ముదురుతున్నాయి. అపాచీ హెలికాప్టర్ల డెలివరీ ఐదేళ్లు ఆలస్యమైందని, ఆ టైమ్‌‌‌‌లో మోదీ వచ్చి ‘సార్‌‌‌‌‌‌‌‌,  ప్లీజ్ సార్‌‌‌‌‌‌‌‌’ అని పిలిచారని ట్రంప్ కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్స్‌‌‌‌తో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి.

పెద్ద షేర్లు ఢమాల్‌‌‌‌..

టీసీఎస్‌‌‌‌, ఇన్ఫోసిస్‌‌‌‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌ వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ షేర్లు 2.20 శాతం వరకు పడ్డాయి. సెక్టార్‌‌‌‌ పరంగా చూస్తే, గురువారం సెషన్‌‌‌‌లో మెటల్‌‌‌‌, ఐటీ షేర్లు ఎక్కువగా పడ్డాయి. ఆటో, ఎఫ్‌‌‌‌ఎంసీజీ, ఫార్మా షేర్ల కూడా ఇండెక్స్‌‌‌‌లను కిందకి లాగాయి. 

వెనెజువెలాలో రాజకీయ అస్థిరత

అమెరికా దాడితో వెనెజువెలాలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ ప్రభావం కమోడిటీలపై త్రీవంగా ఉంది. గోల్డ్‌‌‌‌, వెండి ధరలు పెరుగుతున్నాయి.   వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో, ఆయన భార్యను  అమెరికా స్పెషల్ ఫోర్స్‌‌‌‌ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.

గ్లోబల్ మార్కెట్లు

ఆసియా మార్కెట్లు గురువారం నష్టాల్లో  కదిలాయి. జపాన్‌‌‌‌ నిక్కీ 1.2 శాతం, చైనా సీఎస్‌‌‌‌ఐ300 బ్లూచిప్ ఇండెక్స్ 0.8 శాతం పడ్డాయి.  మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని అక్టోబర్‌‌‌‌‌‌‌‌– మార్చిలో  జీడీపీ గ్రోత్‌‌‌‌ నెమ్మదిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. మొదటి ఆరు నెలల్లో 8 శాతం వృద్ధి నమోదుకాగా, చివరి ఆరు నెల్లో ఇది 6.9 శాతానికి దిగొస్తుందని తెలిపింది. “వచ్చే నెల నుంచి జీడీపీ లెక్కల్లో మార్పులు జరగనున్నాయి. 2026–27 జీడీపీ గ్రోత్ అంచనాలు 6.5 శాతం వద్ద, నామినల్ గ్రోత్‌‌‌‌ 10 శాతం దగ్గర ఉంటాయి”అని  బ్రోకరేజ్ కంపెనీ ఎమ్కే గ్లోబల్ పేర్కొంది.