పంజాగుట్టలో రూ.97 లక్షలు పట్టివేత.. పోలీసుల అదుపులో ఇద్దరు డ్రైవర్లు, కారు, క్యాష్ సీజ్‌‌

 పంజాగుట్టలో రూ.97 లక్షలు పట్టివేత..  పోలీసుల అదుపులో ఇద్దరు డ్రైవర్లు, కారు, క్యాష్ సీజ్‌‌
  • సోమాజిగూడ నుంచి హనుమకొండకు క్యాష్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్
  • తిరుమల్ రెడ్డి ఆఫీస్‌‌ నుంచి సాయిదత్త కన్‌‌స్ట్రక్షన్స్‌‌కు తరలింపు
  • పంజాగుట్టలో టాస్క్‌‌ఫోర్స్‌‌ తనిఖీలు,క్యాష్ పట్టివేత

హైదరాబాద్‌‌, వెలుగు: కన్‌‌స్ట్రక్షన్‌‌ కంపెనీకి చెందిన రూ.97.3 లక్షలు ఆదివారం నార్త్‌‌జోన్ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. డబ్బుకు సంబంధించి డాక్యుమెంట్స్‌‌ చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ ట్రాన్స్‌‌పోర్ట్ చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీ నితిక పంత్‌‌ తెలిపిన వివరాల ప్రకారం...మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌‌లో భాగంగా పంజాగుట్ట గ్రీన్‌‌ల్యాండ్స్‌‌ వద్ద నార్త్‌‌జోన్ టాస్క్‌‌ఫోర్స్‌‌పోలీసులు వెహికిల్ చెకింగ్‌‌ చేశారు. ట్రాఫిక్ సిగ్నల్‌‌ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇన్నోవా(ఏపీ 28 సీఏ 1169) తనిఖీ చేశారు. కారులో  రూ.97.3 లక్షలు గల బ్యాగ్స్‌‌ను గుర్తించారు. డ్రైవర్స్‌‌ అనిల్‌‌ గౌడ్‌‌, రవిలను అదుపులోకి తీసుకుని విచారించారు.

సోమాజిగూడలో క్యాష్ కలెక్షన్.. పంజాగుట్టలో పట్టివేత

వరంగల్‌‌జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేటకు చెందిన ‌‌మంద అనిల్‌‌గౌడ్‌‌(31)రాజు అనే సివిల్‌‌ కాంట్రాక్టర్‌‌‌‌ వద్ద డ్రైవర్‌‌‌‌గా పని చేస్తున్నాడు. రవి సూచనల మేరకు సోమాజిగూడలోని తిరుమల్‌‌రెడ్డి కన్‌‌స్ట్రక్షన్స్‌‌ ఆఫీసులో ఆదివారం ఉదయం రూ.97.3లక్షలు కలెక్ట్‌‌ చేసుకున్నాడు. తనతో పాటు మహబూబాబాద్‌‌జిల్లా తొర్రూరు మండలం మాడిపల్లికి చెందిన మరో డ్రైవర్‌‌‌‌ ఏర్పుల రవి(35)తో కలిసి సోమాజిగూడ నుంచి పంజాగుట్ట గ్రీన్‌‌ల్యాండ్స్‌‌ మీదుగా ట్రావెల్‌‌ చేస్తున్నాడు. క్యాష్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ సమాచారం అందుకున్న నార్త్‌‌జోన్ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు వెహికిల్ చెకింగ్ చేశారు. గ్రీన్‌‌ ల్యాండ్‌‌ సిగ్నల్‌‌ వద్ద కారును అడ్డుకున్నారు.

హనుమకొండకు తరలిస్తున్న క్యాష్ సీజ్‌‌

రెండు బ్యాగ్స్‌‌లో ప్యాక్‌‌ చేసిన నోట్ల కట్టలను గుర్తించారు. అనిల్‌‌గౌడ్‌‌, రవిలను అదుపులోకి తీసుకుని  విచారించారు. సోమాజిగూడలోని తిరుమల్‌‌ రెడ్డి ఆఫీస్‌‌ నుంచి హనుమకొండ శక్కరనగర్‌‌‌‌లోని సాయిదత్త కన్‌‌స్ట్రక్షన్స్‌‌ ఆఫీసుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఐతే క్యాష్‌‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు క్యాష్‌‌ సీజ్ చేశారు. స్థానిక రిటర్నింగ్‌‌ అధికారులకు సమాచారం అందించారు. తదుపరి విచారణ కోసం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ డబ్బును వరంగల్‌‌లోని పలువురు రాజకీయ నాయకులకు అందించేందుకు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సోమవారం కోర్టులో డిపాజిట్ చేసి ఐటీకి అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.