
త్యాగాలు బహుజనులవి.. భోగాలు అగ్రవర్ణాలవా? ఈ తీరు మారాలి. కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా చేయడానికి బహుజన్ సమాజ్‌పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సుదీర్ఘ యాత్ర మొదలుపెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలను ప్రత్యక్షంగా కలిసి, సమాజంలో వారి ప్రాధాన్యత ఏమిటో తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బహుజనులకు రాజ్యాధికారం ఎందుకు కావాలో వీరందరికీ అర్థమయ్యే రీతిలో వివరించడమే ప్రవీణ్ యాత్ర లక్ష్యం. ఈ నెల 6 నుంచి మొదలై ఏడాది కాలం పాటు బహుజన రాజ్యాధికార యాత్ర సాగనుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మరో ఏడాదిన్నర కాలంలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ తమ తమ ప్రయత్నాల్లో మునిగిపోయాయి. ఈసారి ఎలక్షన్స్‌లో కేసీఆర్ నియంతృత్వానికి చరమగీతం పాడాల్సిందే అని కొన్ని పార్టీల నేతలు పిలుపునిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తున్న అంశం కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. ఈ వ్యతిరేకత ముదిరితే తప్పకుండా ఆయనకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెపుతారు. ఈ పాలన మార్పు ద్వారా మళ్లీ అగ్రవర్ణాలకే అధికారం దక్కితే బహుజనులకు తీరని నష్టం కలుగుతుంది. అందుకే వారిలో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు బీఎస్పీ లీడర్ ప్రవీణ్.
ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే..
తెలంగాణలో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తాయి. బహుజనుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అగ్రవర్ణాల అధికారిక సొత్తుగా మారింది. ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేరిందే లేదు. అందుకే సబ్బండ వర్ణాలు పాలనలో మార్పు కోరుకుంటున్నాయి. అందుకే ఈసారి రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఒక చారిత్రక కార్యక్రమంగా బహుజన రాజ్యాధికార యాత్రతో ప్రవీణ్ ముందుకు వస్తున్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర పేరిట ప్రారంభం కానున్న బహుజనుల ఉద్యమం భారీ బహిరంగ సభతో మొదలుకాబోతోంది. రాష్ట్రంలో బాహుజనులను ఏకం చేసి, జనాభా ప్రాతిపదికన ప్రజలకు రావాల్సిన వాటా దక్కించుకోవాల్సిందే. వందల ఏండ్ల నుంచి ఆధిపత్య వర్గాల దోపిడీని ప్రజలకు తెలిసేలా ఈ యాత్ర ఉంటుంది. బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలను ప్రవీణ్ ఈ సందర్భంగా ప్రత్యక్షంగా కలవనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుంటారు. బహుజన రాజ్యంలో ప్రతి సమస్యను తీరుస్తామని హామీ ఇస్తున్నారు. జనవరి 15న బీఎస్పీ చీఫ్ మాయావతి జన్మదినం రోజున ఘనంగా బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభించాలని నిర్ణయించినా కరోనా కారణంగా వాయిదా వేశారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌తో గుర్తింపు
ఖిలాశాపురానికి ఎనలేని గుర్తింపును సాధించి పెట్టింది బహుజన సామ్రాట్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన్ను కన్నది ఈ ఊరే. ఖిలాశాపూర్ వీరుడి చరిత్రను తెలియజేస్తూ.. తెలంగాణలో బహుజన రాజ్యాధికార యాత్ర మొదలుకానుంది. రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దార్ల అరాచకాలను భూస్థాపితం చేసిన యోధుడి జన్మస్థలం ఖిలాశాపూర్. బహుజన సమాజానికి ఆదర్శ ప్రాయుడు, మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని అణచివేసి బహుజన రాజ్య స్థాపన చేసిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్. ఒక బహుజనుడు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకొని రాజ్యాధినేతలను ఎదిరించిన ఘనతను సాధించారు. గోల్కొండపై విజయబావుటా ఎగురవేసిన కీర్తిని చరిత్ర పుటల్లో లిఖించలేదు. ఉత్తర భారతదేశంలో విదేశీయుల నుంచి దేశాన్ని కాపాడిన ఛత్రపతి శివాజీ, దక్షిణ భారతదేశంలో భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై బహుజనులతో ప్రజా రాజ్యాన్ని నిర్మించారు సర్వాయి పాపన్న గౌడ్. సామాజిక చైతన్యంతో బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని మొట్టమొదటగా నిరూపించిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్. సర్వాయి పాపన్న చారిత్రక వారసత్వాన్ని అందిపుచ్చుకునే నాయకుని కోసం బహుజన సమాజం ఎదురుచూస్తోంది. అలాంటి తరుణంలో ఐపీఎస్ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ కుమారే ఇందుకు సరైన నాయకుడని బహుజన సమాజం భావిస్తోంది. ఆయన బీఎస్పీ లో చేరిననాటి నుంచి పార్టీకే కాదు, యావత్ బహుజన శ్రేణుల్లో కదలిక వచ్చింది.
పార్టీ కోసం ప్రవీణ్ కుమార్ కృషి..
బహుజన రాజ్యం కోసం ప్రవీణ్‌కుమార్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ప్రజల్లో ఆయనపై నమ్మకం పెరిగి నీరాజనాలు పలుకుతున్నారు. కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 300 రోజులు బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టనున్నారు. బహుజన రాజ్య స్థాపన చేయడానికి మరో కాన్షీరాంలా అడుగేస్తున్న ప్రవీణ్ కుమార్‌కు యువత, మేధావులు అండగా నిలచేందుకు ముందుకు వస్తున్నారు. ప్రవీణ్ కుమార్ తన 23 ఏండ్ల ఐపీఎస్ సర్వీసులో నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారు. తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ గురుకుల పాఠశాలలకు కార్యదర్శిగా ఎన్నో విజయాలు సాధించారు. తల్లిదండ్రులను కూడా విద్యలో భాగం చేశారు. స్వేరోస్ నెట్వర్క్ స్థాపించి పూర్వ విద్యార్థులందరినీ ఏకం చేసిన ఘనత ప్రవీణ్ కుమార్‌ది. తాను ప్రజలకు చేయాల్సిన సేవ చాలా ఉందని మహనీయులు జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, నారాయణగురు, పెరియార్, బీఆర్ అంబేద్కర్, కాన్షీరాం ఆలోచనా విధానాల విస్తరణకు తన జీవిత కాలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వారి తాత్విక పునాదిని అందిపుచ్చుకున్న బహుజన నాయకత్వం ఆధ్వర్యంలోనే తెలంగాణలో బహుజనుల బతుకులు మారేందుకు అవకాశం ఉంది.
యాత్ర విజయవంతమైతే..
ప్రవీణ్ చేపట్టే బహుజన రాజ్యాధికార యాత్ర విజయవంతమైతే తొందరలో తెలంగాణలో బహుజన రాజ్యం వచ్చేందుకు వీలవుతుంది. దాంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. రైతుల కన్నీళ్లు ఆగుతాయి. నిరుద్యోగుల అవేదనలు, ఉద్యోగుల అసంతృప్తులు కొలిక్కి వస్తాయి. టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. ఇందుకు మొదటి దెబ్బ హుజూరాబాద్‌లోనే పడింది. పది లక్షలు ఇచ్చి దళితులను విభజించి పాలించినంత సులభం కాదు ఎన్నికల్లో గెలవడం. ఈ విషయం కేసీఆర్ అండ్ కంపెనీకి ఈ పాటికే అర్థమయ్యింది. అందుకే ప్రశాంత్ కిషోర్ వంటి వారిని రంగంలోకి దించుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా, బహుజనుల్లో చైతన్యం పెరిగితే మాత్రం పాలనలో మార్పు అసాధ్యమేమీ కాదు. ప్రవీణ్ కుమార్ ఈ యాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయాలపై బలమైన ముద్రను వేయనున్నారు.