తెలంగాణలో పోలీస్ రాజ్యం : ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణలో పోలీస్ రాజ్యం : ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్
  •     బీఆర్​ఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్

వంగూరు, వెలుగు: తెలంగాణలో ప్రజాపాలన కాకుండా పోలీస్ రాజ్యం నడుస్తోందని బీఆర్‌‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం నాగర్​కర్నూల్​ జిల్లా వంగూరు మండలకేంద్రంలోని బ్యాంక్ చౌరస్తాలో నిర్వహించిన మహా రైతు ధర్నా సభలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనపై కాకుండా భూముల సర్వే నంబర్లపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. పోక్సో ఆరోపణలు ఎదుర్కొన్న బండి సంజయ్ కొడుకును తొమ్మిది రోజులు పోలీసులు అరెస్ట్ చేయకుండా దాచిపెట్టారని ఆరోపించారు. 

సీఎం సోదరుల ఇబ్బందులతో కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంపై నెపం మోపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్‌‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకులు వేనేపల్లి గణేశ్​రావు, కోట్ల నరేందర్ రావు, అంకు సురేందర్ పాల్గొన్నారు.