డిండి భూనిర్వాసితులకు  నష్టపరిహారం చెల్లించాలి

డిండి భూనిర్వాసితులకు  నష్టపరిహారం చెల్లించాలి

డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల గోడును పట్టించుకోనే నాధుడే లేడని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామానికి చెందిన తుమ్మల రజిత రిజర్వాయర్ కాల్వ నిర్మాణంలో 4 ఎకరాల వ్యవసాయ భూమిని కోల్పోయి, మానసిక క్షోభకు గురై గత పది రోజుల క్రితం చనిపోయాడు. భూమిని కోల్పోయిన స్థలంలోనే టెంట్ వేసుకుని తాత్కాలికంగా నివాసముంటూ,న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఆమె కూతురు తుమ్మల ప్రగతి కుటుంబాన్ని అయన పరామర్శించారు.  భూమిని కోల్పోయిన ప్రదేశంలోనే నిర్వాసితులు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని,చలికి వణుకుతూ అక్కడే నివాసముంటున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు ప్రవీణ్ కుమార్.

డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వేలాది మంది రైతులకు ప్రభుత్వం చెల్లించే నష్ట పరిహారం అందడం లేదని..చివరకు రైతుబంధు సహాయం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా స్థానిక ఎమ్మెల్యే పోలీసుల సహాయంతో వారిని బెదిరించడం దారుణమైన చర్య అని అన్నారు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదని..నిజంగా పేద ప్రజలపై సీఎం కేసీఆర్ కు ప్రేమ ఉంటే తక్షణమే స్పందించి మార్కెట్ ధరలకు అనుగుణంగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  బాధితులతో కలిసి డిండి రిజర్వాయర్‌ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.