
పెద్దపల్లి, వెలుగు: బీఎస్సీ అభ్యర్థి చేతిలో సీఎం కేసీఆర్‌కు ఓటమి తప్పదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ జోస్యం చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో శనివారం నిర్వహించిన బహుజన రాజ్యాధికార యాత్రలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు.. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయని, ఒకవేళ పెద్దపల్లిలో పోటీ చేస్తే కచ్చితంగా ఓడిపోతారన్నారు. జీపీ కార్మికులు 17 రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం కేసీఆర్‌కు కన్పించడం లేదా అని ప్రశ్నించారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏనాడైనా చీపురు పట్టుకొని రోడ్లను ఊడ్చారా అని నిలదీశారు. 23 ఏండ్ల కింద ఏర్పడ్డ ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, జూనియర్ కాలేజ్, మోడల్ స్కూల్, కేజీబీవీ, సంక్షేమ హాస్టళ్లు మంజూరు చేయకపోవడం పాలకుల వైఫల్యమేనన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు దాసరి హనుమయ్య, దాసరి ఉష, గొట్టే రాజు, తోట వెంకటేశ్ పటేల్, బొంకురి దుర్గయ్య, నార్ల గోపాల్ యాదవ్, సతూరి అనిల్, ఎండీ రియాజ్, కుమ్మరి సవిత, పూరెల్ల స్వప్న గౌడ్, బాల కళ్యాణ్ పంజా, మొలుమూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.