
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అసైన్డ్ భూముల బలవంతపు అక్రమణలపై త్వరలో హైకోర్టులో పిల్ వేస్తామని తెలిపారు.
సోమవారం హైదరాబాద్‌లోని బీఎస్పీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. బహుజన వాదిననే ముసుగులో సీఎం కేసీఆర్ దళితులను పదేండ్లుగా నిండా ముంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బహుజనవాదం బలపడడంతో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను నార్త్ ఇండియా నుంచి అరువుకు తెచ్చుకుంటున్నారన్నారు. పేద రైతుల దగ్గర భూములను గుంజుకుని బడా బాబులకు, తన బినామీలకు కేసీఆర్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు.