
- సిర్పూర్ నుంచి బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ది ధనబలం.. బీఎస్పీది ప్రజాబలమని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: ప్రజాబలంతో వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పార్టీ స్టేట్ ఆఫీసులో బీఎస్పీ నేషనల్ కో-ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్‌తో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆచరణలో సాధ్యం కాని అబద్ధపు హామీలను, మోసపూరిత మేనిఫెస్టోలను ప్రజలు నమ్మొద్దన్నారు. ఆ పార్టీలకు ఉన్నది ధనబలం.. కానీ బీఎస్పీకి ఉన్నది మాత్రం ప్రజాబలమని చెప్పారు. బీసీలకు 60 నుంచి 70 ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీపై ప్రకటనలు చేశారని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న విభజన హామీలు నెరవేర్చడంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అధికారం అట్టిపెట్టుకోవాలని సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ బయట పెట్టడం లేదని విమర్శించారు.
ప్రజల సొమ్ముతో చేసిన సర్వేను రహస్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సూత్రధారులు కేసీఆర్, కేటీఆర్ లేనని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయలని అక్టోబర్ 14న నిరుద్యోగులు తలపెట్టిన సడక్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డీఎస్సీలో 13,086 పోస్టులు పెంచి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకు పీఆర్సీపై ప్రకటన చేశారని ఆరోపించారు. సమావేశంలో మంద ప్రభాకర్, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.
20 మంది అభ్యర్థులు వీళ్లే
1. సిర్పూర్ (జనరల్) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
2. జహీరాబాద్ (ఎస్సీ) - జంగం గోపి
3. పెద్దపల్లి (జనరల్) దాసరి ఉష
4. తాండూరు (జనరల్) చంద్రశేఖర్ ముదిరాజ్
5. దేవరకొండ (ఎస్టీ)- ముడావత్ వెంకటేశ్ చౌహాన్
6. చొప్పదండి (ఎస్సీ) కొంకటి శేఖర్
7. పాలేరు (జనరల్) అల్లిక వెంకటేశ్వర్ రావు
8. నకిరేకల్ (ఎస్సీ) మేడి ప్రియదర్శిని
9. వైరా (ఎస్టీ)- బానోత్ రాంబాబు నాయక్
10. ధర్మపురి (ఎస్సీ) నక్క విజయ్ కుమార్
11. వనపర్తి (జనరల్) నాగమోని చెన్న రాములు
12. మనకొండూరు (ఎస్సీ) నిషాని రామచందర్
13. కోదాడ (జనరల్) - పిల్లిట్ల శ్రీనివాస్
14. నాగర్ కర్నూల్ (జనరల్)- కొత్తపల్లి కుమార్
15. ఖానాపూర్ (ఎస్టీ)- బన్సీలాల్ రాథోడ్
16. ఆందోల్ (ఎస్సీ) ముప్పారపు ప్రకాశ్
17. సూర్యాపేట (జనరల్) - వట్టే జానయ్య యాదవ్
18. వికారాబాద్ (ఎస్సీ) గొర్లకాడి క్రాంతి కుమార్
19. కొత్తగూడెం (జనరల్) - ఎర్ర కామేశ్
20. జుక్కల్ (ఎస్సీ) - ప్రద్యుమ్న కుమార్ మాధవరావు