భగీరథ కంప్లీట్ కాక ..పైసలకే నీళ్లు..

భగీరథ కంప్లీట్ కాక ..పైసలకే నీళ్లు..
  • నల్లా బిల్లులు కట్టేందుకు ఆసక్తి చూపని ప్రజలు 
  • ఎనిమిది మున్సిపాలిటీల్లో  రూ.15.54 కోట్లు పెండింగ్
  • వసూళ్లపై ఫోకస్‌ చేయని అధికారులు, పాలకవర్గాలు 
  • ఎన్నికల ముందు సర్కారు  మాఫీ చేస్తుందనే యోచన  

సంగారెడ్డి, వెలుగు:  మున్సిపాలిటీల్లో మిషన్‌ భగీరథ పనులు ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ప్రజలకు నల్లా బిల్లులు తప్పడం లేదు. కొంత మేర ఈ బిల్లులను చెల్లిస్తున్నా.. చాలా వరకు పెండింగ్‌లో ఉంటున్నాయి.  సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీల్లో మూడేళ్లుగా రూ.15.54 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బిల్లులు వసూలు చేయాల్సిన అధికార యంత్రాంగం, పాలకవర్గాలు కూడా ఎన్నికల ఇయర్‌‌ కావడంతో లైట్ తీసుకుంటున్నాయి. గతంలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి కొంత మేర వసూలు చేసినా.. తర్వాత వదిలేశాయి. 

మున్సిపాలిటీల వారీగా ఇలా...

సంగారెడ్డి జిల్లాలోని మొత్తం ఎనిమిది మున్సిపాలిటీలు ఉండగా తెల్లాపూర్‌‌, అమీన్‌ పూర్‌‌, బొల్లారం మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ మెట్రో వాటర్ వర్క్స్‌ ఆధ్వర్యంలో వ్యక్తికి 20 లీటర్ల వరకు మాత్రమే ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నారు. 20 లీడర్లు దాటితే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బిల్లులే ప్రస్తుతం తెల్లాపూర్‌‌లో రూ.3.16 కోట్లు, అమీన్‌పూర్‌‌లో రూ.1.50 కోట్లు, బొల్లారం మున్సిపాలిటీలో రూ.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి.  మిగతా మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ కంప్లీట్ కాకపోవడంతో అధికారులు మున్సిపల్ ఆధ్వర్యంలోనే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ బిల్లులను ప్రజలు మూడేళ్లుగా చెల్లించడం లేదు. సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.8.91 కోట్లు, సదాశివపేటలో  రూ. కోటి, జహీరాబాద్ మున్సిపాలిటీలో రూ.50 లక్షలు, అందోల్-జోగిపేటలో రూ.37 లక్షలు, నారాయణఖేడ్‌లో రూ.10 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి.  

ఎన్నికల మూడ్‌లోకి పాలకవర్గాలు 

ఎన్నికల టైం దగ్గర పడుతుండడంతో పాలకవర్గాలు నల్లాబిల్లులను పెద్దగా పట్టించుకోవడం లేదు. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్‌‌ఎస్‌ పాలకవర్గాలే ఉండడంతో.. ఈ సమయంలో గట్టిగా వసూలు చేస్తే ఓట్లపై ప్రభావం పడుతుందని వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మూడేళ్లుగా పేరుకుపోయిన నల్లాబిల్లులు మాఫీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని మున్సిపాలిటీల పాలకవర్గ తీర్మానాలు చేసి పంపనున్నట్లు తెలిసింది. ఈ అంశంపై ఆఫీసర్లు కూడా గతంలో మాదిరిగా ఈసారి కూడా నల్లబిల్లులు మాఫీ చేయవచ్చని అంటుండడం గమనార్హం.  

35 శాతం వసూలు చేసినం 

సదాశివపేట మున్సిపాలిటీలో నల్లా బిల్లులు వసూలు చేస్తూనే ఉన్నం.  ఇంకా రూ. 65 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. పొలిటికల్ లీడర్లు, ప్రజల్లో నల్లా బిల్లుల మాఫీపై ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి పనిచేస్తం. అప్పటివరకు బిల్లుల వసూలు మాత్రం ఆపం.

- కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్, సదాశివపేట