గగన్ పహాడ్ లో రూ.2.15 కోట్ల నకిలీ ​సిగరెట్లు సీజ్

గగన్ పహాడ్ లో రూ.2.15 కోట్ల నకిలీ ​సిగరెట్లు సీజ్

శంషాబాద్, వెలుగు: బిహార్​లోని పాట్నా నుంచి హైదరాబాద్ తరలిస్తున్న రూ.2.15 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను హైదాబాద్​లోని రాజేంద్రనగర్​ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు.. బుధవారం గగన్ పహాడ్ వద్ద సంయుక్తంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ టైంలో వచ్చిన ఒక కంటైనర్ వెహికల్ ను సెర్చ్ చేయగా..అందులో నకిలీ బ్రాండ్లతో సిగరెట్లు కనిపించాయి. సర్ఫ్ ప్యాకెట్లను కంటైనర్ డోర్ కు ఎదురుగా పెట్టిన నిందితులు..లోపల నకిలీ ప్యారిస్ విమల్ సిగరెట్ ప్యాకెట్ బాక్సులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

పట్టుబడ్డ సిగరెట్ల విలువ సుమారు రూ.2కోట్ల17లక్షల 42వేల 500 ఉండవచ్చని అంచనా వేశారు. దీనికి సంబంధించిన బిహార్ కి చెందిన రవికాంత్ కుమార్ (37), హర్యానాకు చెందిన మహమ్మద్ సాజిద్ (36), ముబారిక్ ఖాన్ (18), హైదరాబాద్ శాలిబండ కు చెందిన సయ్యద్ ఇలియాజుద్దీన్ (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు.  బిహార్ కి చెందిన సుభాశ్,  హైదరాబాద్ కిషన్ బాగ్ కు చెందిన రెహాన్ ఖాన్ పరారీలో ఉన్నారు. నిందితులు ఈ సిగరెట్లను పాట్నా నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చి చిన్న, చిన్న పాన్ షాపుల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో  వెల్లడైందని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు పేర్కొన్నారు.