రాంగ్ పార్కింగ్ ఫొటో పంపితే రూ 500 రివార్డు

రాంగ్ పార్కింగ్ ఫొటో పంపితే రూ 500 రివార్డు

నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అదే పనిని ఇంకెవరైనా చేస్తే... చూసిన వాళ్లకు ఏం లాభం. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఎవరైనా రోడ్లపై రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాలు పార్కింగ్ చేసినపుడు, ఆ ఫొటోలను పంపిన వారికి రూ.500 బహుమతి ఇచ్చేలా ఒక చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్టు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఇండస్ట్రియల్ డీకార్భనైజేషన్ సమ్మిట్ -2022 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన... ఆ ఫొటోలో ఉన్న రాంగ్ పార్కింగ్ వాహనంపై రూ.1000 జరిమానా విధిస్తే.. ఆ పిక్ ను షేర్ చేసిన వారికి రూ.500 కానుకగా అందజేస్తామని తెలిపారు. ఇక దేశంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య అమాంతం పెరిగిపోతుందన్న ఆయన.. దాంతో పాటు రాంగ్ పార్కింగ్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు. రహదారులపై ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్య రెట్టింపు అవుతోందని.. ఈ నేపథ్యంలోనే ఈ రకమైన ఆలోచన చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.